గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్ విషయంలో కానీ పెర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్లుగా ఉంటారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, శౌర్యం సినిమాలు రెండూ కూడా బాగున్నాయనిపించుకున్నాయి. అయితే ఎందుకనో ఆ తర్వాత ఇద్దరూ కలిసి పనిచేయలేదు. చూస్తుంటే 11 ఏళ్ల తర్వాత ఈ కాంబో మళ్ళీ వర్కౌట్ అవుతుందా అనిపిస్తోంది.

గోపీచంద్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. వరసగా ఈ యాక్షన్ హీరో నటించిన సినిమాలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి బోల్తా కొట్టేశాయి. తన మార్కెట్ కూడా పూర్తిగా డల్ అయిపోయింది. అయితే ఒక్క హిట్ అందుకుంటే తన కెరీర్ లెక్కలన్నీ మారిపోతాయని గోపీచంద్ కు కూడా తెలుసు. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరోకు కావాల్సింది ఒక నిఖార్సైన హిట్. అందుకే ఆసక్తికర సినిమాలను ఎంచుకుంటున్నాడు.

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఫుట్ బాల్ నేపధ్యమున్న సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో అలివేలు వెంకటరమణ అనే చిత్రం చేయాల్సి ఉంది. ఈ సినిమాకు మొదట కాజల్ ను హీరోయిన్ గా తేజ అనుకున్నాడు. అయితే తన చిత్రం సీతలో కూడా కాజల్ నటించింది. సో చేంజ్ కోసం ఈసారి అనుష్కను తీసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట. మరి స్వీటీ ఈ ప్రాజెక్ట్ కు ఎస్ చెబుతుందా అన్నది చూడాలి.