‘గుంటూరోడు’ ఆ సినిమాలకు పంచ్ ఇస్తాడా?

ఈ నెల అన్ని వారాంతాలకూ సినిమాలు ఫిక్సయ్యాయి. దీంతో చాన్నాళ్లుగా విడుదల కోసం చూస్తున్న కొన్ని సినిమాలకు మార్చి మీద దృష్టిపెట్టాయి. ఫస్ట్ వీకెండ్లో రెండు మూడు చిన్న సినిమాలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇంతలో మంచు మనోజ్ కళ్లు కూడా అదే డేట్ మీద పడ్డాయి. ఫిబ్రవరి 17కే రావాల్సిన మనోజ్ మూవీ ‘గుంటూరోడు’ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

ఈ చిత్రాన్ని మార్చి 3న రిలీజ్ చేయాలని తాజాగా ఫిక్సయ్యారు. అదే రోజు అంజలి లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘చిత్రాంగద’.. ‘పెళ్లిచూపులు’ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ద్వారక’.. తమిళ డబ్బింగ్ మూవీ ‘మెట్రో’ కూడా రిలీజ్ డేట్ ఖాయం చేసుకున్నాయి. మాంచి మాస్ మసాలా సినిమాలాగా కనిపిస్తున్న ‘గుంటూరోడు’ మీద మంచి అంచనాలే ఉన్న నేపథ్యంలో ఈ బుల్లి సినిమాలు దాని ధాటికి ఎలా తట్టుకుంటాయో చూడాలి.

ఇంతకుముందు నవీన్ చంద్రతో ‘నా రాకుమారుడు’ అనే క్లాస్ సినిమా తీసిన ఎస్.కె.సత్య ఈసారి మనోజ్ హీరోగా పక్కా మాస్ సినిమా చేశాడు. ఇందులో ‘కంచె’ భామ ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించింది. శౌర్య.. అటాక్ సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్న మనోజ్.. ‘గుంటూరోడు’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి అన్ సీజన్లో వస్తున్న ఈ చిత్రం మనోజ్‌కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.