వెంకీ టోటల్‌గా ముంచేసాడు!

అనుకున్నంతా అయింది. ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల కావాల్సిన ‘గురు’ వారం రోజులు ముందుకి జరిగే సరికి రెండవ వారంలో ‘కాటమరాయుడు’కి ఇబ్బందులు తప్పవని భయపడ్డట్టే పవన్‌ చిత్రాన్ని వెంకటేష్‌ సినిమా ఎఫెక్ట్‌ చేస్తోంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్‌ తెచ్చుకున్న ‘గురు’ ఆదివారం సూపర్‌ స్ట్రాంగ్‌గా వుంది.

మొదటి రెండు రోజుల కంటే ఆదివారం వసూళ్లు చాలా బాగున్నాయని, ఇవాళ్టి వసూళ్లు మూడు కోట్లకి పైగానే వుంటాయని ట్రేడ్‌ చెబుతోంది. గురు అన్ని చోట్లా హౌస్‌ఫుల్స్‌ అవుతూ వుండడంతో ఆ ప్రభావం కాటమరాయుడుపై పడింది. శనివారం, ఆదివారం వసూళ్లు పెరుగుతాయని ఆశించిన బయ్యర్లకి గురు రూపంలో చుక్కెదురైంది.

కాటమరాయుడు సిటీల్లో కూడా హౌస్‌ఫుల్స్‌ నమోదు చేయలేకపోతోంది. మరో ముప్పయ్‌ కోట్ల షేర్‌ వస్తే కానీ గట్టెక్కని ఈ చిత్రానికి శని, ఆదివారాల్లో కనీసం ఆరేడు కోట్లు వస్తాయని అంచనా వేసారు. కానీ గురులాంటి హిట్‌ సినిమా మార్కెట్లోకి దిగేసరికి కాటమరాయుడుకి సెకండ్‌ వీకెండ్‌ క్యాష్‌ చేసుకునే వీలు చిక్కలేదు. ఈ కారణంగా ముందుగా అంచనా వేసిన దానికంటే తక్కువకే కాటమరాయుడు ఫుల్‌ రన్‌ బిజినెస్‌ క్లోజ్‌ అవుతుందని, బయ్యర్లకి మరింత ఎక్కువ నష్టాలు వస్తాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.