హరీష్ చెప్పిన ‘డబ్బింగ్’ సీక్రెట్

హరీష్ శంకర్‌కు దర్శకుడిగా కంటే రచయితగా మంచి పేరుంది. అతడి సినిమాల్లో పంచ్ డైలాగులు బాగుంటాయన్న పేరుంది. హరీష్ సినిమాల ఫలితాలు అటు ఇటు అవుతుంటాయి కానీ.. తన సినిమాల్లో డైలాగులు మాత్రం బాగానే పేలుతుంటాయి.

హరీష్ లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’లో కథాకథనాలపై విమర్శలు వచ్చినా.. డైలాగుల విషయంలో మాత్రం పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. తన నుంచి ప్రేక్షకులు మంచి డైలాగులు ఆశిస్తారని.. అందుకే ఆ విషయంలో తాను కష్టపడుతుంటానని.. అస్సలు రాజీ పడనని అంటున్నాడు హరీష్ శంకర్. తాను మాటల విషయంలో ఎంత శ్రద్ధ పెడుతుంటానో ఓ ఇంటర్వ్యూలో వివరించాడు హరీష్.

తన సినిమాల్లో డైలాగుల విషయమై ఫైనల్ వెర్షన్ అంటూ ఏమీ ఉండదని హరీష్ చెప్పాడు. మళ్లీ మళ్లీ తిరగరాస్తుంటానని.. సెట్స్ లోకి వెళ్లాక కూడా డైలాగులు మారుతుంటాయని తెలిపాడు. చాలాసార్లు డబ్బింగ్ జరుగుతున్న టైంలో కూడా డైలాగులు మార్చానని హరీష్ తెలిపాడు. అప్పటికప్పుడు ఏవైనా మంచి డైలాగులు అనిపిస్తే.. మార్చి వాటితోనే డబ్బింగ్ చెప్పిస్తుంటానని.. అప్పటికే షూటింగ్ పూర్తయి ఉన్నా తాను రాజీ పడనని.. దీని వల్ల కొన్నిసార్లు ఆర్టిస్టులు కెమెరా ముందు చెప్పే డైలాగ్‌కు, డబ్బింగ్‌లో వినిపించేదానికి సంబంధం ఉండదని.. లిప్ సింక్ అవ్వదని.. ఇందుకు అసలు కారణం తాను చివరి నిమిషాల్లో డైలాగులు మార్చడమే అని హరీష్ తెలిపాడు.

తాను ఓవైపు ఎన్నారై ప్రేక్షకుల క్లాస్ టేస్టుకు తగ్గట్లు.. తెలుగు రాష్ట్రాల్లో మారు మూల గ్రామాల్లోని ఆడియన్స్ మాస్ టేస్టుకు తగ్గట్లుగా రెండు రకాలుగా మాటలు రాయాలని ప్రయత్నిస్తుంటానని.. ఐతే ఎక్కువగా తాను రాసే మాస్ డైలాగులకే పేరు వస్తుంటుందని హరీష్ చెప్పాడు. మంచి మెసేజ్‌తో తాను రాసే డైలాగుల్ని కూడా గుర్తించాలని హరీష్ కోరాడు.