ట్రంప్ మీద కోపమే చూపించాలంటున్న హీరో

కాలం మారింది. సినీ రంగ ప్రముఖుల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సినిమాల్లోనే కాదు.. బయట కూడా చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సున్నితమైన రాజకీయ అంశాలు.. ప్రజాఉద్యమాలపై రియాక్ట్ కాకుండా.. అసలేం జరుగుతుందన్న విషయమే తమ దృష్టికి రాలేదన్నట్లుగా వ్యవహరించే తీరును మార్చేసుకుంటున్నారు.

తమ చుట్టూ జరుగుతున్న ఇష్యూల మీద పెదవి విప్పుతున్నారు. మరికొందరైతే ఏకంగా పిలుపునిస్తున్నారు కూడా. మొన్నటికి మొన్న తమిళనాడులో జరిగిన జల్లికట్టు వ్యవహారంలో తమిళ నటీనటుల రియాక్షన్ ఒకటైతే.. సినిమా.. ఇల్లు తప్పించి మరో విషయమే పట్టనట్లుగా వ్యవహరించే ప్రిన్స్ మహేశ్ కూడా స్పందించటం.. సోషల్ మీడియాలో తన కామెంట్ ను పోస్ట్ చేసిన వైనం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇక.. తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకే అంతర్గత రచ్చపై తమిళ సినీ ప్రముఖులు కమల్ హాసన్ నుంచి.. అరవింద్ స్వామి వరకూ తమ కోపాన్ని.. ఆగ్రహాన్ని బహిరంగంగా చెప్పేయటమే కాదు.. తాము ఎటువైపు ఉన్నామన్నవిషయాన్ని ఓపెన్ గా చెప్పేందుకు ఏమాత్రం వెనకడుగు వేయని వైనం తెలిసిందే. తాజాగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు..యావత్ దేశాన్ని కదిలించిన కూచిబొట్ట శ్రీనివాస్ ను విద్వేష హత్యపైన సినీ రంగ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు.

సెలెక్టివ్ సోషల్ అంశాల మీదనే రియాక్ట్ అయ్యే హీరో సిద్ధార్ద్.. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న జాత్యాంహకార హత్యపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మిగిలిన సినీ ప్రముఖులకు భిన్నంగా తన ట్వీట్ ను సూటిగా ట్రంప్ కు టార్గెట్ చేసేశారు. జరిగిన ఉదంతంపై షాక్ అస్సలు వద్దని.. విద్వేషాన్ని వ్యాపింపచేస్తున్న ట్రంప్ మీద కోపాన్ని ప్రదర్శించాలంటున్నారు.

శ్రీనివాస్ కూఛిబొట్ల కాల్పుల కేసును విద్వేష నేరంగా పరిగణించాలని ఆయన ట్వీట్ చేశారు. ట్రంప్ విధానాల కారణంగా.. గడిచిన కొద్ది నెలల్లో అమెరికాలో పెరిగిపోయిన విద్వేషం అంతాఇంతా కాదు. గతంలో అసూయను కడుపులోనే దాచుకున్న చాలామంది ఇప్పుడు బహిర్గం కావటమే కాదు.. ఓపెన్ గా చెప్పేస్తే.. వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు. గతంలో తేడా వస్తే చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయం ఉండేది.

ఇప్పుడు విద్వేషాన్ని పెంచి పోషించే ట్రంప్ సర్కారు కొలువు తీరి ఉండటంతో.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే దారుణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదే విషయాన్ని తన ట్వీట్ తో చెప్పేశాడు సిద్దార్థ్. నిజమే.. అమాయకుల ప్రాణాలు తీస్తున్న విద్వేషానికి కారణమైన ట్రంప్ ను కోపగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రంప్ ను కోపగించుకోవటమే కాదు.. అమెరికాలోని మనోళ్ల రక్షణపై మన పాలకులు గళం విప్పటం.. ఒత్తిడిని పెంచటం షురూ చేయాల్సిందే. పెద్దన్నపై ఒత్తిడా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. సరిగా ప్రయత్నిస్తే.. అది సాధ్యమే సుమి.