వయసైపోయిన హీరో కు ఇంత బడ్జెట్టా

సీనియర్ హీరో రాజశేఖర్ మూడేళ్ల కిందట ‘గడ్డం గ్యాంగ్’ అనే సినిమా ఒకటి చేశాడు. ఆ సినిమాను నాలుగైదు కోట్ల బడ్జెట్లో తీశారు. ఐతే అది అందులో పావు వంతైనా వసూలు చేసిందా అంటే డౌటే. సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. దీన్ని బట్టి రాజశేఖర్ మార్కెట్ ఎంత దారుణంగా దెబ్బ తిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘గరుడ వేగ’ మీద ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కొంచెం ఆసక్తి అయితే ఉంది. దీని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ట్రాక్ రికార్డు బాగుండటం.. దీని ఫస్ట్ లుక్ అదీ ఆకట్టుకోవడమే దీనికి కారణం. ఈ పాజిటివ్ బజ్ చూసుకుని నిర్మాత కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ అది ఏ స్థాయిలో ఉండాలి..? మహా అయితే పది కోట్లు.

కానీ ‘గరుడ వేగ’ బడ్జెట్ ఏకంగా రూ.25 కోట్లు అంటున్నాడు నిర్మాత కోటేశ్వర రాజు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కోటేశ్వర రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. రూ.25 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని.. ఏ విషయంలోనూ అస్సలు రాజీ పడట్లేదని చెప్పాడు రాజు.

ఐతే రాజశేఖర్ మార్కెట్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయినప్పటికీ రూ.25 కోట్లు వసూలు చేయడం అన్నది కష్టమే అని చెప్పాలి. రవితేజ రేంజి హీరోలకు మాత్రమే రూ.25 కోట్ల బడ్జెట్ వర్కవుటవుతుంది. అలాంటిది ఫేడవుట్ అయిపోయిన రాజశేఖర్ మీద ఏ నమ్మకంతో అంత బడ్జెట్ పెడుతున్నారో..? నిజంగానే అంత ఖర్చు పెట్టారా.. లేక పబ్లిసిటీ కోసం ఈ ఫిగర్ చెబుతున్నారా అన్నది సందేహం.