పూరితో బాలయ్య.. పైసావసూలే

ఆరు నెలలు వెనక్కి వెళ్దాం. అప్పటికి నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఊపుమీదున్నాడు. మరోవైపు పూరి జగన్నాథ్ చూస్తే.. ‘జ్యోతిలక్ష్మీ’, ‘లోఫర్’, ‘ఇజం’ లాంటి హ్యాట్రిక్ డిజాస్టర్లతో బాగా వెనుకబడిపోయి ఉన్నాడు. అలాంటి తరుణంలో పూరి దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని ఎవ్వరైనా దాన్ని జోక్ గానే భావించేవాళ్లు.

ఈ కాంబినేషన్లో సినిమా అంటూ ముందు వార్తలొచ్చినపుడు అందరూ తేలిగ్గానే కొట్టిపారేశారు. తర్వాత ఈ కాంబోనే నిజమని తేలినపుడు అందరూ బాలయ్య నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఐతే గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్న బాలయ్య.. మరీ గుడ్డిగా పూరిని ఎలా నమ్మేస్తాడు?

బాలయ్య-పూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘పైసా వసూల్’ మరీ కొత్తగా ఉంటుందన్న అంచనాలేమీ లేవు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుందనే స్థాయిలో అంచనాలేమీ లేవు. కానీ ఆ స్టంపర్.. ట్రైలర్ చూశాక మాత్రం ఇది పేరుకు తగ్గట్లే పైసా వసూల్ సినిమా అయ్యే అవకాశాల్ని మాత్రం కొట్టిపారేయలేం. ఈ సినిమా కచ్చితంగా బాలయ్యకు మాత్రం మేలు చేస్తుందనే భావించవచ్చు.
ఎందుకంటే కంటెంట్ విషయంలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో ఏమో కానీ.. బాలయ్య పాత్ర వరకు ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేదనే అనిపిస్తోంది ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోస్ చూస్తే. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ కు ఈ సినిమా విందు భోజనమే కావచ్చు. బాలయ్య వంద సినిమాలు చేసినా.. వాటన్నింటికీ భిన్నంగా కనిపించాడు ‘పైసా వసూల్’లో.

ఇలాంటి పూరి మార్కు తిక్క క్యారెక్టర్ బాలయ్య ఎప్పుడూ చేసింది లేదు. ‘పైసా వసూల్’ వల్ల క్లాస్ యూత్ ఆడియన్స్ లో కొత్తగా క్రేజ్ సంపాదించుకున్నాడు బాలయ్య. సోషల్ మీడియాలో ఈ చిత్ర స్టంపర్.. ట్రైలర్లకు వచ్చిన రెస్పాన్సే అందుకు రుజువు. ‘శాతకర్ణి’ కంటే ముందు బాలయ్య చేసిన సినిమాలతో పోలిస్తే ‘పైసా వసూల్’కు క్రేజ్ కొంచెం ఎక్కువే ఉంది.

ఓపెనింగ్స్ కూడా ఇంకా బెటర్ గానే ఉంటాయని భావిస్తున్నారు. మొత్తంగా పూరితో బాలయ్య సినిమా ఎందుకు చేశాడు అన్న సందేహాలకు విడుదలకు ముందే సమాధానం ఇచ్చింది ‘పైసా వసూల్’. కథాకథనాల పరంగా తక్కువ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకుల్ని.. ఆ విషయంలో ఈ సినిమా సంతృప్తి పరిస్తే ఇది పెద్ద స్థాయి సినిమా అయ్యే అవకాశాలున్నాయి.