వద్దే వద్దన్న నాగ్ ఎలా ఒప్పుకున్నాడు?

అక్కినేని నాగార్జున-రాఘవేంద్రరావు కలిసి శ్రీ వేంకటేశ్వరుడి పరమభక్తుడైన అన్నమయ్య మీద అద్భుతమైన సినిమా చేశారు. మళ్లీ అదే వేంకటేశ్వరుడు.. ఇంకో భక్తుడు అనగానే జనాల్లో ఏమంత ఆసక్తి కలగలేదు. ‘ఓం నమో వెంకటేశాయ’ మీద అనుకున్నంత బజ్ రాలేదు. ఐతే సామాన్య ప్రేక్షకుల్లాగే నాగార్జున సైతం ఈ సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదట. కథ కూడా వినకుండానే ఈ సినిమా వద్దని తేల్చి చెప్పేశాడట. ఐతే కథ విన్నాక మాత్రం నాగార్జున అభిప్రాయం మారిపోయిందని.. రేప్పొద్దున సినిమా చూశాక ప్రేక్షకులకు కూడా ఈ సినిమాలోని ప్రత్యేకతేంటో అర్థమవుతుందని అంటున్నాడు రాఘవేంద్రరావు.

‘‘హాథీరాం బాబా వేంకటేశ్వరుడికి పరమ భక్తుడు. ఈ సృష్టిలో ఇంతమంది భక్తులుండగా స్వామి వారు పాచికలు ఆడడానికి హాథీరామ్‌ బాబాని ఎంచుకున్నారంటే అతను ఎంతటి మహా భక్తుడో అర్థం చేసుకోవొచ్చు. హాథీరామ్‌ బాబా జీవిత చరిత్ర చాలా తక్కువ దొరికింది. దాని కోసం చాలా శోధించాం. చరిత్రను అనుసరిస్తూ కథ రాసుకున్నాం. ముందు నాగార్జునకు ఏమీ చెప్పకుండా కథ సిద్ధం చేశాం. ఐతే నాగార్జునకు ఈ సినిమా గురించి చెప్పగానే.. ‘అన్నమయ్య’ కంటే గొప్ప క్లైమాక్స్‌ ఎక్కడా ఉండదని.. దాన్ని పాడుచేయడం ఎందుకని అంటూ ఈ సినిమాను వదిలేద్దాం అన్నారు. ‘అన్నమయ్య’ క్లైమాక్స్‌‌ని జనం అంత ఎత్తున నిలబటెట్టారు. ఆ ఎమోషన్‌ అలాంటిది. భారవికి అది గుర్తుంది. అందుకే ఈసారి కూడా అద్భుతమైన ముగింపు ఇచ్చాడు. నాగ్‌కు కథ మొత్తం వినిపించాక ఆయన కూడా అలాగే ఫీలయ్యాడు. ముందు సినిమా వద్దన్నవాడే.. తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా సినిమా మొదలుపెట్టేయండి అన్నాడు’’ అని రాఘవేంద్రరావు చెప్పాడు.