మన హీరోలపై అరవ ప్రభావం

తమిళ హీరోలు అటు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే మధ్యలో ఆఫ్‌బీట్‌ క్యారెక్టర్లకీ సై అంటూ వుంటారు. కమల్‌హాసన్‌, సూర్య, విక్రమ్‌ తదితరులు తరచుగా కొత్తరకం పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

మేకప్‌ అధికరగా వేసుకోవాల్సిన పాత్రలో, ఫిజికల్‌ డిజెబిలిటీ వున్న పాత్రలో చేయడానికి ఇష్టపడతారు. నటులుగా అలాంటి పాత్రలు ఛాలెంజింగ్‌గా వుండడమే కాకుండా, అవార్డులనీ, ప్రశంసలనీ కూడా తెచ్చి పెడుతుంటాయి. అయితే తెలుగు హీరోలు అంతటి ప్రయోగాలు చేయడానికి సాహసించరు. మన హీరోలు ఎప్పుడూ గ్లామరస్‌గా వుండడానికే ఇష్టపడతారు. మన ఆడియన్స్‌ కూడా హీరో అంటే హీరోలానే వుండాలని అనుకుంటారే తప్ప వాళ్లని వికలాంగులుగానో, విచిత్ర వేషాలతోనో చూడాలని అనుకోరు.

కానీ ట్రెండు మారి ఇప్పుడు ఆడియన్స్‌ అభిరుచి మారుతోంది. సినిమాలని హీరోయిజం కోసం కాకుండా ఎక్స్‌పీరియన్స్‌ కోసం చూస్తున్నారు. దీంతో మన హీరోలు కూడా అరవ హీరోల్లా పద్ధతి మారుస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు హీరోలు వివిధ చిత్రాల్లో ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు.

స్టార్‌ హీరో అయి వుండీ సుకుమార్‌ చిత్రంలో చరణ్‌ వినికిడి లోపమున్న యువకుడి పాత్ర చేస్తున్నాడు. రవితేజ ఏమో ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో అంధుడిగా కనిపించబోతున్నాడు. అలాగే రాజ్‌ తరుణ్‌ కూడా ‘అంధగాడు’లో అంధుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలకి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి మన హీరోలు ప్రయోగాల్లో మరింత ముందుకి వెళ్లే అవకాశాలుంటాయి.