ట్రంప్ దూకుడు త‌గ్గేందుకు ఆమె కార‌ణ‌మ‌ట‌

అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యిన అనంత‌రం అమెరిక‌న్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌సంగించిన స‌మ‌యంలో ఆయ‌న స్వ‌రం త‌గ్గ‌డాన్ని ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా గ‌మ‌నించింది. గ‌తంలో ఉన్న వాడీవేడీ ఆయ‌న స్పీచ్‌లో క‌నిపించ‌లేదు. దీని వెనుక కార‌ణ‌మేంటా అని చాలా మంది చాలా ర‌కాలుగా విశ్లేషించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ దీని వెనుక ఉన్న అస‌లు సీక్రెట్‌ను ఇప్పుడు వైట్ హౌజ్ అధికారులు వెల్ల‌డించారు. ట్రంప్ స్వ‌రం త‌గ్గ‌డానికి కార‌ణం ఆయ‌న కూతురు ఇవాంకానేన‌ని వాళ్లు స్ప‌ష్టంచేస్తున్నారు.

ట్రంప్‌కు ఇవాంకా అన‌ధికారిక స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. నిజానికి ట్రంప్ ప్ర‌సంగాన్ని రూపొందించ‌డానికి ప‌ది రోజుల స‌మ‌యం ప‌ట్టిందట‌. జ‌న‌వ‌రి 20న అధ్య‌క్షుడిగా బాధ్య‌తలు స్వీక‌రించిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టి స్పీచ్‌కూ స్ప‌ష్ట‌మైన వ్య‌త్యాసం క‌నిపించ‌డానికి ఇదే ప్ర‌ధాన కార‌ణం.త‌న ప్ర‌సంగంలో త‌ర‌చూ డెమొక్రాట్లు, మీడియాపై చేసే విమ‌ర్శ‌లు వినిపించ‌లేదు. ట్రంప్ ప్ర‌సంగం ముగియ‌గానే నిర్వ‌హించిన పోల్‌లో చాలా మంది ఈ మార్పును స్వాగ‌తించారు. ఆదివారం ఈ ప్ర‌సంగంపై ఓవ‌ల్ ఆఫీస్‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో ఇవాంకానే కీల‌క‌మైన సూచ‌న‌లు చేసింద‌ని, ట్రంప్ కొత్త విధానాన్ని రూపొందించింది ఆమేనని వైట్‌హౌజ్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు ఆ దేశ మీడియాకు వెల్ల‌డించారు. ఎంతోమంది ఆయ‌న చుట్టూ చేరి స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసినా.. ట్రంప్ మాత్రం త‌న కూతురి మాట‌నే విన్నార‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్యంగా చైల్డ్ కేర్‌, పెయిడ్ ఫ్యామిలీ లీవ్‌లాంటి విష‌యాల్లో సానుకూలంగా మాట్లాడాలని ఇవాంకా సూచించిన‌ట్లు మ‌రో అధికారి తెలిపారు. మ‌హిళ‌లు, మైనార్టీల‌కు సంబంధించిన విష‌యాల్లో ఇవాంకా కీల‌క‌మైన సూచ‌న‌లు చేస్తున్న‌ది.

నిజానికి ట్రంప్ ప్రచారంలోనూ ఇవాంకా కీల‌క‌పాత్ర పోషించింది. ఆయ‌న గెలిచిన త‌ర్వాత త‌న కుటుంబ వ్యాపారం నుంచి దూరం జ‌రిగి ట్రంప్ అన‌ధికార స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. ట్రంప్ త‌న ప్ర‌సంగాన్ని తానే రూపొందించుకున్నా.. త‌న కూతురు స‌ల‌హాల‌ను మాత్రం క‌చ్చితంగా పాటిస్తార‌ని వైట్‌హౌజ్ అధికారి ఒక‌రు చెప్పారు. కాపిట‌ల్ హిల్‌కు వెళ్లే ముందు ట్రంప్‌తోపాటు కారులో ఇవాంకా కూడా ఉంది. ఈ ప్ర‌సంగ రూప‌క‌ల్ప‌న‌లో ఇవాంకా భ‌ర్త‌, వైట్‌హౌజ్ సీనియ‌ర్ అడ్వైజ‌ర్ కుష్నెర్ కూడా త‌న‌వంతు పాత్ర పోషించాడు. దీంతో ఫ్యామిలీ మాట‌ను ట్రంప్ బాగానే వింటున్నాడ‌ని చ‌ర్చ సాగుతోంది.