వెన్నుపోటు రగడ: వైఎస్‌ జగన్‌, ఎన్టీఆర్‌ కంటే గొప్పోడా.?

రాజకీయాల్లో వెన్నుపోట్లు అత్యంత సహజం. ఒకడు పైకి రావాలంటే, ఇంకొకడ్ని తొక్కాల్సిందే.! తక్కువ కాలంలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలంటే వెన్నుపోటు తప్పనిసరి. తెలుగు నాట వెన్నుపోటు రాజకీయం.. అనగానే, చాలామంది చంద్రబాబు పేరునే ప్రస్తావిస్తారుగానీ.. ఇలాంటి వెన్నుపోట్లు తెలుగు రాజకీయాల్లో కుప్పలు తెప్పలుగా జరిగాయి.

ఒకప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌, ఎందుకు రాజకీయంగా తొక్కివేయబడ్డారు.? ఈ ప్రశ్నకు సమాధానం ఓపెన్‌ సీక్రెట్‌. పీపుల్స్‌ లీడర్‌ పి.జనార్ధన్‌రెడ్డి (పిజెఆర్‌) పరిస్థితి ఎందుకలా తయారైంది.? ఇదీ ఓపెన్‌ సీక్రెట్‌. ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘అతి త్వరలో జగన్‌ ప్రభుత్వం కూలిపోతుంది.. టీడీపీ అధికారంలోకి వస్తుంది’ అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనడంపై.. సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి ‘వెన్నుపోటు’ సెటైర్‌ వేయడమే.

‘వెన్నుపోటు రాజకీయాలకు బలైపోవడానికి జగన్‌ ఏమీ ఎన్టీఆర్‌ కాదు..’ అంటూ బాలయ్యకు సెటైర్‌ వేశారు పోసాని కృష్ణమురళి. అంతే, రచ్చ షురూ అయ్యింది. ‘అప్పట్లో టీడీపీని, లక్ష్మీపార్వతి చేతుల్లోకి వెళ్ళకుండా చంద్రబాబు కాపాడారు.. అది నాయకత్వ మార్పు మాత్రమే.. వెన్నుపోటు కాదు..’ అయినా, గతంలో చంద్రబాబు భజన చేసిన పోసాని, ఇప్పుడు ఈ తరహా విమర్శలు చేయడమేంటి.? అంటూ పోసాని కృష్ణమురళిపై ‘మెంటల్‌ కృష్ణ’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వసమెత్తుతున్నారు టీడీపీ మద్దతుదారులు.

మరోపక్క, వైఎస్‌ జగన్‌ ఏడాది పాలన తర్వాత, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిథులే ప్రభుత్వాన్ని, సొంత పార్టీని నిలదీస్తున్న వైనాన్ని ‘వెన్నుపోటుకి రంగం సిద్ధమవుతోంది’ అంటూ ప్రొజెక్ట్‌ చేస్తోంది సోషల్‌ మీడియాలో తెలుగు తమ్ముళ్ళ దండు. రాజకీయ చాణక్యం విషయంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? తన రాజకీయ జీవితంలో అస్సలేమాత్రం ఊహించని ఘటన జరిగింది.. టీడీపీ తనకు దూరమయ్యింది.. ఆ బాధను స్వర్గీయ ఎన్టీఆర్‌ జీర్ణించుకోలేకపోయారు.

వైఎస్‌ జగన్‌నీ, స్వర్గీయ ఎన్టీఆర్‌నీ పోల్చడం సబబేనా.? రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ మారిపోవడానికి ఈ రోజుల్లో పెద్దగా సమయం అవసరం లేదు. రాత్రికి రాత్రి ఈక్వేషన్స్‌ మారిపోవచ్చు. ఆ విషయం రాజకీయాల్లో వున్నవారకే కాదు, రాజకీయాల పట్ల ఏ మాత్రం అవగాహన వున్న సామాన్యులకైనా అర్థమవుతుంది. ఏదో సెటైర్‌ కోసం పోసాని, వైఎస్‌ జగన్‌ని ఎన్టీఆర్‌ కంటే గొప్పోడని చెప్పేశారుగానీ.. ఆయనకు మాత్రం వాస్తవం తెలియదా.?