ఫ్లాప్ అయినా రేటు మాత్రం తగ్గించనంటుంది

మాటలకు ముసుగేయకుండా తనకేం అనిపిస్తే అది మాట్లాడేస్తుంది కంగనా రనౌత్. ఆమె ఎంత బోల్డో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఏ విషయంలో రాజీ పడని మనస్తత్వం ఆమెది. తన కొత్త సినిమా ‘రంగూన్’ ప్రమోషన్లలో భాగంగా కంగనా ఎన్ని చోట్ల ఎన్ని బాంబులు పేల్చిందో తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా కంగనా తగ్గట్లేదు. ‘రంగూన్’ ఫెయిల్యూర్ గురించి ఓపెన్‌గా మాట్లాడేయడమే కాదు.. ఈ సినిమా ఆడలేదు కాబట్టి తర్వాతి సినిమాలకు రెమ్యూనరేషన్లో కోత పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించింది కంగనా.

‘‘నా ఫెయిల్యూర్‌ను సొమ్ము చేసుకోవాలని జనాలు అనుకుంటున్నారు. కంగనా ఇప్పుడు రెమ్యూనరేషన్లో డిస్కౌంట్ ఇస్తుందనుకుంటున్నారు. కొందరు నా దగ్గరికి వచ్చి ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్లకు ఒకటే సమాధానం చెప్పా. కాంట్రాక్టులో ఇలాంటి విషయాల గురించి ప్రస్తావన లేదు కదా అని. ఒక ఆర్టిస్టుగా నా పనికి విలువ ఇవ్వాలి. నేను మీకు ఇన్ని డేట్లు ఇస్తున్నపుడు నా పని గంటలకు.. ఒక పాత్రను పోషించడంలో నా ప్రతిభకు డబ్బులివ్వాలి. కాబట్టి ఫెయిల్యూర్లను బట్టి డిస్కౌంట్లు ఉండవు’’ అని కుండబద్దలు కొట్టేసింది కంగనా.

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో కంగనా, షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించిన వార్-లవ్ డ్రామా ‘రంగూన్’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మంచి రివ్యూలొచ్చాయి. కానీ ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద ఫెయిల్యూర్ అయింది. పెట్టుబడిలో సగం కూడా వసూలు చేయలేకపోయింది.