రాజమౌళి గురించి అంత మాట అనేశాడేంటి?

ఇండియాలో ప్రస్తుతం ఎందరెందరో గొప్ప దర్శకులున్నారు. కోలీవుడ్లో చూస్తే శిఖరం లాంటి శంకర్ ఉన్నాడు. బాలీవుడ్లో చూస్తే రాజ్ కుమార్ హిరాని లాంటి అత్యున్నత స్థాయిని అందుకున్న దర్శకుడున్నాడు. ఇంకా ఆయా ఇండస్ట్రీల్లో ఎందరెందరో గొప్ప డైరెక్టర్లున్నారు. ఐతే స్వయంగా తనే ఒక మేటి దర్శకుడిగా గుర్తింపు సంపాదించిన కరణ్ జోహార్.. రాజమౌళి గురించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

తమ కాలంలో రాజమౌళే ఇండియాలో అత్యుత్తమ దర్శకుడని కితాబిచ్చేశాడు కరణ్. ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదల నేపథ్యంలో రాజమౌళితో తీసిన సెల్ఫీని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన కరణ్.. ‘‘ఈ దశాబ్దపు మేటి దర్శకుడితో నేను. ఈ మేధావితో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. మా కాలంలో కచ్చితంగా ఇతనే అత్యుత్తమ దర్శకుడు’’ అని తేల్చేశాడు. సక్సెస్‌నే కొలమానంగా తీసుకుంటే ‘బాహుబలి-2’తో ఎవ్వరూ అందుకోలేని స్థాయి విజయాన్ని అందుకోబోతున్న రాజమౌళి కచ్చితంగా ఇండియాస్ బెస్ట్ డైరెక్టరే.

కానీ కంటెంట్ పరంగా చూస్తే రాజమౌళి కన్నా గొప్ప దర్శకులు ఇండియాలో చాలామంది ఉన్నారని.. ఎంత ‘బాహుబలి’ని తన బేనర్ నుంచి రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇలా తొందరపడి రాజమౌళే అత్యుత్తమ దర్శకుడని తేల్చేయడం సరి కాదని సోషల్ మీడియాలో వేరే ఇండస్ట్రీల వాళ్లు అభిప్రాయపడ్డారు. ‘బాహుబలి-2’ ప్రభంజనం నేపథ్యంలో సోషల్ మీడియాలో నార్త్ వెర్సస్ సౌత్ డిస్కషన్ కూడా నడుస్తుండటం విశేషం. మన రాజమౌళిని ఉత్తరాది క్రిటిక్స్ ఓ రేంజిలో పొగిడేస్తుండటం.. ‘బాహుబలి-2’ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని విమర్శించడం అక్కడి వాళ్లను ఉడికిస్తోంది.