Karthika Deepam Serial 8th January Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 725 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 726 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (ఫ్రిబవరి 8) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

దీప, సౌర్య.. కార్తీక్, హిమలు ఒక షాపింగ్ మాల్‌లో కలుస్తారు. హిమ సౌర్యను పక్కకు తీసుకుని వెళ్లి.. ‘నువ్వు రాలేదేంటీ?’ అంటుంది. దాంతో దీప శ్రావ్య ఇంటికి వెళ్లిందన్న విషయం సౌర్యకు తెలిసిపోతుంది. అదే టైమ్‌లో దీప కార్తీక్‌తో కొంటెగా మాట్లాడుతుంటే.. కార్తీక్ దీపకు ‘విడాకులు ఇవ్వట్లేదని రెచ్చిపోకు’ అంటూ వార్నింగ్ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే.. హిమ దీపని పెద్దమ్మ అని పిలవడం, సౌర్య, కార్తీక్ షాక్ అవ్వడంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటికి వచ్చిన సౌర్య.. దీపని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే సరికి.. దీప కోపంతో ఊగిపోతుంది.

అంతేనా ఇంకేమైనా తెలుసుకోవాలా?

‘వాళ్లంతా ఎవరా? నాకు ఏం అవుతారా? ఆ ఇంటికి నేను వెళ్లకూడదా? నిన్న కాక మొన్న పుట్టావ్? నువ్వు నాకు చెబుతున్నావా? వాళ్లంతా నా వాళ్లు.. ఆ శ్రావ్య పిన్నీ నా సొంత చెల్లెలు.. అమ్మా దీపా అని పిలిచే తాతయ్య నా కన్నతండ్రి.. నేను పుట్టిపెరిగింది ఆ ఇంట్లోనే. అందుకే.. అందుకే నిన్న పుట్టినోడికి పెద్దమ్మ అయ్యాను.. ఆ హిమ అందుకే నన్ను పెద్దమ్మ అంది. అంతేనా ఇంకేమైనా తెలుసుకోవాలా? అసలు హిమ నీకు ఏం చెప్పింది?’ అంటుంది దీప ఆవేశంగా..

నువ్వే మొత్తం చెప్పేశావమ్మా..

దీప చెప్పిన నిజాలన్నీ విని.. సౌర్య షాకింగ్‌గా నిలబడిపోతుంది. ‘అమ్మా.. అది.. హిమ నాకు ఏం చెప్పలేదమ్మా.. అన్నీ నువ్వే చెప్పేశావమ్మా.. శ్రావ్య పిన్ని ఇంటికి వెళ్లావని మాత్రమే చెప్పింది. ఇప్పుడు నువ్వు మొత్తం చెప్పేశావ్’ అంటూ నోటికి చెయ్యి అడ్డ పెట్టుకుని నవ్వు ఆపుకుని ఆపుకుని ఒక్కసారే నవ్వేస్తుంది. వెంటనే దీప పిచ్చి చూపులు చూస్తూ.. ‘అందుకే నేను వెర్రి బాగులుదాన్ని అయ్యాను’ అంటూ నవ్వుతుంది. ఇద్దరూ చాలా సేపు నవ్వుకుంటారు.

నువ్వు చెప్పు నాన్నమ్మా..

కార్తీక్, హిమ, సౌందర్య, ఆనందరావులు తింటూ ఉంటారు. అయితే హిమ వంటలక్క గురించి స్టార్ చెయ్యడంతో.. కార్తీక్ కోపడతాడు. దాంతో హిమ.. కార్తీక్ వైపు కోపంగా చూస్తూ.. ‘అయితే నేను నిన్ను ఏం అడగను డాడీ.. నాన్నమ్మని అడుగుతాను’ అనగానే ఆనందరావు సౌందర్యకు గ్లాసుతో మంచినీళ్లు ఇస్తాడు. తీసుకుని గడగడా తాగేస్తుంది సౌందర్య. ఆ సీన్ కాస్త సీరియస్‌గా కాస్త ఫన్నీగా ఉంటుంది. ‘నువ్వు చెప్పు నాన్నమ్మా.. వంటలక్క మనకి చుట్టాలు అవుతారని, శ్రావ్య పిన్ని అక్క అని ఎందుకు చెప్పలేదు?’ అని అడిగే సరికి అంతా షాక్ అవుతారు.

హిమ నిర్ణయం..

‘అన్నీ అక్కడ నేర్చుకుని వచ్చిందా?’ అంటూ కార్తీక్ మళ్లీ సీరియస్ అవుతాడు. అయితే హిమ తగ్గదు. ‘వంటలక్క చాలా మంచిది. తనకి ఏం లేదనేగా మీరు అంతా తనని దూరం చేశారు. ఆస్తి, కార్లు లేవనేగా ఇలా చేస్తున్నారు?’ అంటూ చాలా మాటలు అంటుంది. చివరిగా ‘నేను ఇక నుంచి వంటలక్కని పెద్దమ్మా అనే పిలుస్తాను’ అంటుంది హిమ. కార్తీక్ ‘వద్దమ్మా’ అంటాడు. చాలా సేపు నచ్చజెబుతాడు.

కార్తీక్ ఫైర్.. ‘వద్దని చెప్పానా?’

‘మీరు పెద్దమ్మని ఎలా చూసినా ఇక నుంచి నేను పెద్దమ్మా అనే పిలుస్తాను’ అంటుంది మరోసారి హిమ. వెంటనే ‘వద్దని చెప్పానా?’ అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో సౌందర్య మనసులో… ‘కన్నతల్లిని పట్టుకుని పెద్దమ్మా అని పిలవడమేంటీ నాన్‌సెన్స్..’అనుకుంటూ.. ‘డాడీ చెబుతున్నాడుగా.. ఇక నుంచి పెద్దమ్మా అని పిలవకు’ అంటుంది హిమతో.. వెంటనే కార్తీక్ పైకి లేచి.. ‘కంట్లో కారం పెట్టి నోట్లో బెల్లం పెట్టడం నీ తర్వాతే ఎవరికైనా సాధ్యం మమ్మీ..’ అంటూ అక్కడ నుంచి ఆవేశంగా వెళ్లిపోతాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.