Karthika Deepam Serial December 10th Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 673 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 674 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 10) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

హిమని బైక్ మీద స్కూల్‌లో డ్రాప్ చేస్తాడు కార్తీక్. వెంటనే.. ‘డాడీ విడాకులు అంటే ఏంటీ?’ అని హిమ కార్తీక్‌ని అడుగుతుంది. ఆటోలో తల్లితో కలిసి స్కూల్‌కి వస్తున్న సౌర్య కూడా దీపని అదే ప్రశ్న వేస్తుంది. ‘విడాకులంటే శాపం’ అని దీప చెప్పగా.. ‘విడాకులంటే వరం’ అని కార్తీక్ చెబుతాడు. ‘కలిసి ఉండాలని ఒకరు కోరుకుని, కలిసి ఉండొద్దని మరొకరు అనుకునే ఓ జంజాటం’ అని దీప సౌర్యతో చెబుతుంటే.. అక్కడ కార్తీక్.. ‘నువ్వు నాకు వద్దు అని భార్య భర్తని, భర్త భార్యని కోర్టుకు తీసుకుని వెళ్తే అక్కడ ఇద్దరి అనుమతీ తీసుకుని విడిపోవడమే విడాకులు’ అంటాడు. ‘అయితే విడాకులు తీసుకుంటే ఇంకెప్పుడూ కలవరా?’ అని అడిగిన ప్రశ్నకు.. దీప ఏడుస్తూ ‘కలవరు.. కలవాలనుకున్న కలవలేరు’ అంటుంది. సౌర్య కూడా తల్లిని బాధగా పట్టుకుంటుంది. కార్తీక్ కూడా అదే సమాధానం హిమతో కఠినంగా చెబుతాడు.

కార్తీక్‌కి దీప సేవలు..

హిమతో విడాకుల గురించి చెప్పేలోపు సౌర్య, దీపలు ఆటోలో స్కూల్‌కి వస్తారు. హిమ, కార్తీక్‌లని చూసిన సౌర్య.. నవ్వుతూ వచ్చి పలకరిస్తుంది. కార్తీక్ మాత్రం నవ్వి నవ్వనట్లుగా ఓ నవ్వు నవ్వుతాడు. ‘ఏంటీ డాక్టర్ బాబు ఈ రోజు బైక్ మీద వచ్చారు?’ అని సౌర్య అడగడంతో.. ‘నేనే అడిగాను సరదాగా’ అంటుంది హిమ. మొత్తానికి హిమకు బాయ్ చెప్పి బయలుదేరిన కార్తీక్.. సౌర్యని, దీపని వెనక్కి వెనక్కి చూస్తూ బైక్ మీద వెళ్తుంటాడు. ఇంతలో సౌర్య ప్రేమగా చూస్తూ.. బండీ మీద తన తల్లి దీప ఉన్నట్లుగా ఊహించుకుంటుంది. పక్కనే ఉన్న దీప.. సౌర్య భుజం మీద చేయి వేసేసరికి అది ఊహకావడంతో బాధగా చూస్తుంది. ఇంతలో కార్తీక్ ఓ ఆటోని ఢీకొట్టి కింద పడిపోతాడు. అది చూసిన హిమ ‘డాడీ’ అంటూ పరుగుతీస్తుంది. వెనుకే దీప, సౌర్యలు పరుగుతీస్తారు.

దీప ప్రేమ పిల్లలకు అర్థమైంది!

కార్తీక్ పైకి లేవలేని స్థితిలో కిందే ఇబ్బంది పడుతూ ఉంటాడు. వెంటనే దీప కళ్లనిండా నీళ్లతో.. ‘డాక్టర్ బాబూ’ అంటూ.. కార్తీక్ మీద పడిన బండిని తీసేసి.. కార్తీక్ కాలు పట్టుకుని, కాలికి ఉన్న షూ తీసేసి.. దెబ్బ తగిలిన చోట నొక్కుతుంది. తన భుజం సపోర్ట్ ఇస్తూ పైకి లేపి.. చుట్టూ పరిసరాలను మరిచిపోయి తన ప్రేమనంతా చూపిస్తుంది. దాంతో హిమ మనసులో.. ‘ఏంకానీ డాడీ కోసం వంటలక్క ఇంత బాధపడుతుంటే.. పెళ్లి చేస్తే ఇంకెంత బాగా చూసుకుంటుందో కదా?’ అనుకుంటుంది. సౌర్య మనసులో.. ‘హిమ వీళ్లకి పెళ్లి చేయాలనుకుంటుంది. నేను వీళ్లని కలపాలనుకుంటున్నాను. ఎలాగైనా అమ్మా నాన్నలని ఒకటి చేయాలి’ అని ఆలోచిస్తుంది. ఇంతలో పైకి లేచిన కార్తీక్.. దీప చేతులని వదిలించుకుని మొహమాటంగా ఓ నవ్వు నవ్వి వెళ్లిపోతాడు. అది గమనించిన సౌర్య.. ‘దీని బట్టి అమ్మకి డాక్టర్ బాబంటే చాలా ఇష్టమని అర్థమైంది కానీ.. నాన్నకే అమ్మంటే ఇష్టం లేదు. కానీ ఎందుకు నాకు నాన్న మీద కోపం రావట్లేదు. నాన్న కాబట్టా?’ అని ఆలోచించుకుంటుంది.

ముందు మీ అత్తగారికి చెప్పు!

భాగ్యం మళ్లీ లెక్కలు వేస్తుంది. దాంతో శ్రావ్య.. తల్లితో.. ‘ఏం లెక్కలేస్తున్నావ్. దీప భరణం లెక్కలా?’ అంటుంది. ‘అవునే కానీ ఆ హిమ మాత్రం నా ఆశలని అడియాసలు చేసేలా ఉంది.. మీ బావగారు కార్తీక్‌కి దీపకి పెళ్లి చేయాలని చూస్తోంది’ అనడంతో.. ‘వాళ్లకి ముందే పెళ్లి అయ్యిందన్న విషయం తెలియదు కదా.. అయినా ఈ విషయం గురించి ఒకసారి మా అత్తగారితో మాట్లాడమ్మా ఒకసారి ఆవిడ నీకు సరైన సమాధానం చెబుతుంది’ అంటూ కౌంటర్ వేస్తుంది. దాంతో భాగ్యం భయపడుతూ.. ‘అమ్మో మీ అత్తగారా.. వద్దే తల్లీ.. అయినా నన్ను మీ అత్తగారు పేరు చెప్పి భయపెట్టడం కాదు. నీకు ధైర్యముంటే.. మొన్న మౌనిత అన్న మాటలను మీ అత్తగారికి చెప్పు అంటూ తిప్పుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

కార్తీక్‌కి షాకిచ్చిన మౌనిత

కార్తీక్ కాలి నొప్పికి టాబ్లెట్ వేసుకుంటాడు. ఇంతలో మౌనిత వచ్చి.. ‘ఆ మెడిసిన్ కంటే అద్భుతమైన మెడిసిన్ తీసుకొచ్చాను.. విడాకుల కేసు గెలవాలని అడ్వకేట్ పట్టుమీద ఉన్నాడు. సాయంత్రం వస్తే.. అతడితో మాట్లాడొచ్చు’ అని చెప్పి బయలుదేరుతుంది. వెంటనే ఆగి.. వెనక్కి తిరగకుండానే.. ‘కాలికి ఆయింట్‌మెంట్ రాసుకో. ఇంకో మోతాడు వేసుకో. కుంటుకుంటూ అడ్వకేట్ దగ్గరకు వచ్చి.. ‘నేను నా పెళ్లాం, పిల్లల ముందు పడిపోయాను, నా పెళ్లామే నన్ను లేపి సేవలు చేసిందని చెప్పకు’ అంటూ వెళ్లిపోతుంది. దాంతో కార్తీక్ మనసులో.. ‘ఈ విషయం మౌనితకు ఎలా తెలిసింది?’ అనుకుంటాడు.

విడాకులు ఇచ్చేయ్!

హిమ స్కూల్‌లో లంచ్ టైమ్‌లో దీపతో మాట్లాడాలి అనుకుంటుంది. సౌర్య కూడా హిమ ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకుని అక్కడ నుంచి తప్పుకుంటుంది. దాంతో దీపని పక్కకు తీసుకుని వెళ్లిన హిమ… ‘వంటలక్కా.. నేను నీతో మాట్లాడిన విషయం గురించి ఏం ఆలోచించావ్?’ అని అడగగానే దీప టెన్షన్‌తో చీర కొంగును చేత్తో తిప్పుతూ ఉంటుంది. ‘నాకు అర్థమైందిలే వంటలక్కా. సినిమాల్లో హీరోయిన్స్ పెళ్లి చూపుల్లో ఇలాగే సిగ్గుపడతారు.. నీకు ఇష్టమేనని ఇందాక మా డాడీ కింద పడినప్పుడే అర్థమైంది’ అంటుంది హిమ. వెంటనే దీప చీరకొంగు వదిలి ఇబ్బందిగా చూస్తుంది. మళ్లీ హిమే మాట్లాడుతూ.. ‘వంటలక్కా.. నువ్వు ఓ పని చేయాలి. మొదట సౌర్య వాళ్ల డాడీకి విడాకులు ఇచ్చేసి.. తర్వాత మా డాడీని పెళ్లి చేసుకోవాలి’ అని అనగానే దీప షాక్ అయ్యి.. పైకి లేస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.