పవన్ దెబ్బకు పది సినిమాలు వాషౌట్!

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ కథే వేరు. అంతకుముందు సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయి ఉన్నా సరే.. అతడి కొత్త సినిమాకు హైప్ వచ్చేస్తుంది. పోయినేడాది సమ్మర్లో వచ్చిన పవన్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. అయినా పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ మీద ఆ ఎఫెక్ట్ ఏమీ పడలేదు. ఈ చిత్రానికి హైప్ ఓ రేంజిలో వచ్చేసింది. టీజర్ రిలీజైనప్పటి నుంచి ‘కాటమరాయుడు’ హంగామా మామూలుగా లేదు.

దీనికి తోడు ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. దీంతో హైప్ మరింత పెరిగింది. ఈ సినిమా అన్ని రకాలుగా నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలుకొట్టేయనుంది. ఆల్రెడీ ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో కొత్త నాన్-బాహుబలి రికార్డు నమోదు చేసింది ‘కాటమరాయుడు’. ఇక సినిమాను రిలీజ్ చేసే థియేటర్లు.. ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల విషయంలోనూ నాన్-బాహుబలి రికార్డులు బద్దలు కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

దాదాపు నెల రోజులుగా బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. పరీక్షల సీజన్.. పైగా స్టార్ హీరోల సినిమాలు లేక థియేటర్లలో సందడి కనిపించట్లేదు. అందులోనూ ఈ నెలలో అయితే థియేటర్లు వెలవెలబోతున్నాయి. ప్రతి వారం చాలా సినిమాలే వస్తున్నాయి కానీ అవేవీ ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షించట్లేదు. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తక్కువలో తక్కువ పది సినిమాలు థియేటర్లలో ఉన్నాయి.

నెల ఆరంభంలో వచ్చిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మొదలుకుని ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఐదారు సినిమాలు కలిపి కనీసం డజను సినిమాలు ఈ వీకెండ్లో థియేటర్లలో ఉంటాయి. ఐతే వీటన్నింటికీ ‘కాటమరాయుడు’ చెక్ పెట్టనున్నాడు. ఒక్క దెబ్బకు కనీసం పది సినిమాలు థియేటర్ల నుంచి లేచిపోవడం ఖాయం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం థియేటర్లలో ‘కాటమరాయుడు’ సినిమాను నింపేసే అవకాశాలున్నాయని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. కాబట్టి ‘కాటమరాయుడు’ కలెక్షన్ల మోత మామూలుగా ఉండదన్నట్లే.