‘కబాలి’ని కొట్టేసిన ‘కాట‌మ‌రాయుడు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే ఆ లెక్కే వేర‌ని మ‌రోసారి రుజువైంది. ‘కాట‌మ‌రాయుడు’ సినిమా విష‌యంలో ఇప్ప‌టిదాకా ఎన్నెన్ని నెగెటివ్ వార్త‌లు విన్నామో లెక్క‌లేదు. ఈ సినిమాకు అనుకున్నంత హైప్ రావ‌ట్లేదని.. సినిమాపై ఒక‌ర‌క‌మైన నెగెటివ్ ప్ర‌భావం ప‌డిపోయింద‌ని చాలా డిస్క‌ష‌న్లు న‌డిచాయి. తీరా టీజ‌ర్ వ‌చ్చే స‌మ‌యానికి అన్నీ ప‌క్కకు వెళ్లిపోయాయి. అంద‌రూ ప‌వ‌న్ మాయ‌లో ప‌డిపోయారు. ఒకే ఒక్క చిన్న డైలాగ్ తో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసేశాడు ప‌వ‌న్. సోష‌ల్ మీడియాలో శ‌నివారం సాయంత్రం నుంచి ఎక్క‌డ చూసినా ‘కాట‌మ‌రాయుడు’ టీజ‌ర్ గురించే చ‌ర్చ. సామాన్య అభిమానుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ ‘కాట‌మ‌రాయుడు’ టీజ‌ర్ సూప‌ర్బ్ అంటూ తీర్పిచ్చేశారు.

పెద్దగా హైప్ లేకుండా విడుద‌లైన ‘కాట‌మ‌రాయుడు’ టీజ‌ర్ యూట్యూబ్ లో ప్ర‌కంప‌న‌లు రేపింది. పాత రికార్డుల‌న్నింటినీ స‌వ‌రించింది. నెలన్న‌ర కింద‌టే మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబ‌ర్ 150’ నెల‌కొల్పిన రికార్డును ‘కాట‌మ‌రాయుడు’ టీజ‌ర్ బ‌ద్ద‌లు కొట్టింది. చిరు టీజ‌ర్ 3 గంట‌ల 5 నిమిషాల్లో మిలియ‌న్ మార్కును అందుకుంటే.. ప‌వ‌న్ టీజ‌ర్ రెండే రెండు గంట‌ల్లో ఆ ఘ‌న‌తను సాధించింది. ఈ రెండు గంటల్లోనే ‘కాటమరాయుడు’ టీజర్ లక్ష లైకులు కూడా సాధించడం విశేషం. ఇది కూడా రికార్డే. అంటే ఇకపై టీజ‌ర్లన్నంటికీ ఇది బెంచ్ మార్క్ అన్న‌మాట‌.

మరో విశేషం ఏంటంటే.. ‘కాటమరాయుడు’ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ టీజర్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. సౌత్ ఇండియాలో అత్యంత వేగంగా 2 మిలియన్ మార్కును అందుకున్న టీజర్‌ గా ఇది రికార్డు నెలకొల్పింది. ఈ టీజర్ 5 గంటల 23 నిమిషాల్లో ఆ ఘనతను సాధించింది. రజినీకి ఉన్న ఫాలోయింగ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సౌత్ ఇండియా అంతటా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. కానీ పవన్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాలు.. కర్ణాటక వరకే పరిమితం. అయినా పవన్ టీజర్ ‘కబాలి’ రికార్డును బద్దలు కొట్టడం విశేషమే. మొత్తానికి 30 సెక‌న్ల టీజ‌ర్‌తో ప‌వ‌న్ పెను ప్ర‌కంప‌న‌లే సృష్టించాడు.