కాటమరాయుడు… ఎటు చూసినా గ్రే!

‘బుక్‌మైషో.కామ్‌’ వెబ్‌సైట్‌లో టికెట్‌ బుక్‌ చేద్దామని వెళ్లిన వాళ్లకి గ్రే సీట్లు కనిపిస్తే యమ నీరసం వచ్చేస్తుంది. గ్రే కలర్‌లో సీట్‌ కనిపించిందంటే అది బుక్‌ అయిపోయిందని అర్థమన్నమాట. ప్రస్తుతం కాటమరాయుడు చిత్రానికి ఎటు చూసినా గ్రే సీట్లే కనిపిస్తున్నాయి.

ఎన్నో థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నప్పటికీ, మరెన్నో షోలు కేటాయించినప్పటికీ ఈ చిత్రానికి క్రేజ్‌ అలా ఇలా లేదు. పవన్‌కళ్యాణ్‌ సినిమా తొలి రోజు చూసేయాలనే ఆరాటంతో దొరికిన సీట్లు దొరికినట్టు బుక్‌ చేసి పారేస్తున్నారు. ఎక్కడో హైదరాబాద్‌ నగర శివార్లలో థియేటర్లలో ఒకటీ అరా టికెట్లు మినహా అన్నీ సేల్‌ అయిపోయాయి. వారం రోజుల ముందుగానే బుకింగ్‌ స్టార్ట్‌ అయినా, కొత్తగా యాడ్‌ అవుతోన్న షోలకి ఇప్పటికీ అదే డిమాండ్‌ వుంది.

ఈమధ్య కాలంలో ఏ సినిమాకీ దొరకనన్ని థియేటర్లు దీనికే దొరికేసరికి మొదటి రోజు రికార్డు ఓ రేంజ్‌లో వుంటుందని ట్రేడ్‌ ప్రిడిక్ట్‌ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్‌ డే రికార్డుని ఖైదీ నంబర్‌ 150 సవరించి ఎన్నో రోజులవలేదు. కానీ ఈలోగానే ఆ రికార్డుకి కాలం చెల్లిపోయేలాగుందని ట్రేడ్‌ సర్కిల్స్‌ అంటున్నాయి. పూర్తిస్థాయి మాస్‌ సినిమా కావడంతో బి, సి సెంటర్లలో జాతర జరగడం తథ్యమని అంచనాలున్నాయి.