సోనియా హ‌ర్ట‌య్యే ప‌ని చేస్తున్న కేసీఆర్‌!

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఇర‌కాటంలో ప‌డేలా గులాబీ దళ‌ప‌తి అడుగులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. కేసీఆర్ నిర్ణ‌యం నేరుగా సోనియాను టార్గ‌టె్ చేయ‌క‌పోయినా… ఆమె ఇబ్బంది పడ‌టం ఖాయ‌మ‌నే కామెంట్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ దేని గురించి అంటే, మాజీ ప్ర‌ధాన‌మంత్రి, కాంగ్రెస్ నేత‌, దేశాన్ని ఆర్థిక క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వేసిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు శతజయంతి గురించి. ఈనెల 28 న పీవీ నరసింహారావు శత జయంతి జరుగనుంది. ఈ సందర్భంగా సంవత్సం పొడుగునా అయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆర్డ‌ర్ వేసేశారు.

పీవీ శ‌త‌జ‌యంతి నేప‌థ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేర‌కు ఆదేశాలు ఇవ్వ‌డ‌మే కాకుండా ఓ క‌మిటీ కూడా వేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత కె. కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఈరోజు సమావేశమైంది. ఈ కమిటీ సమావేశానికి మంత్రి కె.తారక రామరావు, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. పీవీ నరసింహారావు కుటుంబసభ్యులు హాజరైన ఈ సమావేశంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వచ్చే సంవత్సరం పీవీ జయంతి వరకు కనీసం పది, పన్నెండు ఘనమైన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా కమిటీ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి ఒక జాతీయ సెమినార్ మెదలుకుని పీవీ స్మారక కేంద్రం ఏర్పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న కమిటీ భవిష్యత్తులో పీవీతో అనుబంధం ఉన్న మరింత మందితో విస్తరిస్తామన్నారు.

ప్రస్తుతం దేశం ఇంతమంచి పరిస్థితుల్లో ఉన్నదంటే, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే పి.వి.నరసింహారావు కాలంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఆయన నాయకత్వంలో విజయవంతంగా అధిగమించడమే కారణమని కె.కె అన్నారు. కేవలం పరిపాలనాలో మాత్రమే కాకుండా భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర గణనీయమైనది అని అన్నారు. ఇలా అనేక అనేక అంశాల్లో పీవీ పాత్ర ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని జ్ఞానభూమి లో ఈనెల 28వ తేదీన శతజయంతి ఉత్సవాలను నుంచి వచ్చే ఏడాది జరగనున్న జయంతి నాటికి వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించిందన్నారు. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉన్న మెమోరియల్ మాదిరే పీవీకి ఒక మెమోరియల్ ఉండాలన్న ఆలోచన తమకు ఉందని కేకే అన్నారు. దీంతోపాటు వంగరలోనూ వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాటు పార్లమెంట్‌లో పీవీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కూడా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం చర్చించిన అంశాల పైన ముఖ్యమంత్రితో చర్చించి తుది కార్యక్రమాలను ఆయన ప్రకటిస్తారని కేకే తెలిపారు.