దుబ్బాక ఉప ఎన్నికపై కేసీఆర్‌ ధీమా.. అసలు కథేంటి.?

తెలంగాణ రాష్ట్ర సమితి, దుబ్బాక ఉప ఎన్నికలో సిట్టింగ్‌ స్థానాన్ని చాలా తేలిగ్గా గెలిచేస్తామనే నమ్మకాన్ని ప్రదర్శిస్తోన్న విషయం విదితమే. అయితే, గతంలో ఎన్నడూ లేనంత ‘కష్టమైన’ పరిస్థితులు టీఆర్‌ఎస్‌కి దుబ్బాకలో ఎదురవుతున్న మాట వాస్తవం. మరీ ముఖ్యంగా బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌కి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, దుబ్బాకలో నానా యాగీ చేస్తోంది. దానికి రెట్టింపు యాగీ బీజేపీ చేస్తోంది. కాంగ్రెస్‌ కూడా తాను తక్కువేమీ కాదంటోంది.

ఓ అనధికార సర్వే ప్రకారం చూస్తే, దుబ్బాకలో బీజేపీకే ప్రస్తుతానికి ఎడ్జ్‌ వుందట. అదెలా సాధ్యం.? అసలు ఆ సర్వే సంగతేంటి.? అంటూ ఇప్పుడు తెలంగాణలో అంతా ఆ సర్వే చుట్టూ లెక్కలేసుకోవాల్సి వస్తోంది. ‘అది జస్ట్‌ పెయిడ్‌ సర్వే’ అని గులాబీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. దుబ్బాకలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అకాల మరణంతో, ఆయన భార్య టీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగారు.

సో, సెంటిమెంట్‌ ప్రకారం చూసుకుంటే ఆమె విజయం పెద్ద కష్టమేమీ కాదు. ‘గతంలో ఈ తరహా సెంటిమెంట్లను టీఆర్‌ఎస్‌ దెబ్బకొట్టింది కాబట్టి, ఈసారి టీఆర్‌ఎస్‌కి జనం దెబ్బకొట్టబోతున్నారు..’ అంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్‌. మరోపక్క, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ‘ఆ పంచాయితీనే లేదు.. ఆ సీటు మళ్ళీ గెలిచేది మేమే..’ అని కేసీఆర్‌ తెగేసి చెబుతున్నారు. కేసీఆర్‌కి, అక్కడ హరీష్‌రావు మీద బోల్డంత నమ్మకం వుంది. తెలంగాణలో తమకు తిరుగులేదన్న నమ్మకమూ వుంది.

అయితే, పోలింగ్‌ రోజు ఈక్వేషన్స్‌ ఎలా వుంటుందన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఎందుకంటే, క్షణ క్షణానికీ దుబ్బాకలో ఈక్వేషన్స్‌ మారిపోతున్నాయి. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ఎలా వున్నాయో, వాటిని ప్రత్యక్షంగా చూస్తోన్న హరీష్‌రావు ఆందోళనలోనే కన్పిస్తోంది. కాగా, హరీష్‌ రావుతోపాటు కేసీఆర్‌, దుబ్బాక ఉప ఎన్నికపై చేస్తున్న ప్రకటనల్లో ఏదో మర్మం దాగి వుందనీ, కొత్త అనుమానాలకు టీఆర్‌ఎస్‌ నేతల ప్రకటనలు తావిస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తుండడం కొసమెరుపు.