కారూ.. కంగారూ.. గీ నీతులేంది కేసీఆర్‌ సారూ.!

గ్రేటర్‌ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి పిల్లి మొగ్గలేసేస్తోంది. ‘భాగ్యలక్ష్మి దేవాలయమే ఎందుకు.? పెద్దమ్మతల్లి దేవాలయానికి వెళ్ళొచ్చు కదా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అమాయకంగా ప్రశ్నించేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. ‘హైద్రాబాద్‌ మీద సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తారా.?’ అంటూ బీజేపీ మీద విరుచుకుపడింది. ‘ఏం, హైద్రాబాద్‌.. భారతదేశంలో లేదా.?’ అనీ టీఆర్‌ఎస్‌ నేతలు నిలదీసేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.. ఇప్పుడు తీరిగ్గా నీతులు చెప్పేస్తున్నారు గ్రేటర్‌ ఓటర్లకి. ఇదే సోయ, 2014 ఎన్నికల సమయంలో ఎందుకు లేదు.? తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ‘సోయ’ కోల్పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.? ‘అది ఉద్యమం, ఇది పాలన..’ అంటూ కేటీఆర్‌, ఆనాటి ‘తెలంగాణ తిట్ల దండకం’పై తాపీగా సెలవిచ్చారు.

‘మేం కూడా అప్పుడు చాలా మాటలు మాట్లాడినం.. కానీ, తెలంగాణ వచ్చాక, మేం అందర్నీ ఒకేలా చూశాం..’ అని ఇప్పుడు గ్రేటర్‌లో సెటిలర్ల ఓట్ల కోసం ‘వెన్నపూస’ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘తెలంగాణ సరిహద్దులదాకా సీమాంధ్రుల్ని తరిమికొట్టాలి..’ అని పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే. ఈ లిస్ట్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌ సహా చాలామంది తెలంగాణ నేతలున్నారు. అప్పుడు టీఆర్‌ఎస్‌ ఎలాంటి దూషణలకైతే దిగిందో, ఇప్పుడు బీజేపీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. పైగా, బీజేపీ విమర్శలు చేస్తోన్నది, తెలంగాణ ప్రజల మీద కాదు.. హైద్రాబాదీల మీద కూడా కాదు. పాత బస్తీలో వున్న అసాంఘీక శక్తుల మీద.

నిజమే.. తెలంగాణలో చాలా దేవాలయాలున్నాయి.. అందులో భాగ్యలక్ష్మి దేవాలయం కూడా ఒకటి. చార్మినార్‌కి అనుకుని వున్న ఈ దేవాలయానికి ఘన చరిత్ర వుంది. దురదృష్టవశాత్తూ, పాతబస్తీ రాజకీయాల నేపథ్యంలో భాగలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వున్న చారిత్రక ప్రాముఖ్యత ప్రపంచానికి తెలియకుండా పోతోంది. ఆ ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చి, ఓటు బ్యాంకు రాజకీయాలు బీజేపీ చేస్తోందనే అనుకున్నా.. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరమేముందిక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి.?

‘వెకిలి మాటలు వినొద్దు..’ అంటూ గ్రేటర్‌ ప్రజల్ని ఉద్దేశించి కేసీఆర్‌ పిలుపునిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన వెకిలి వ్యాఖ్యల మాటేమిటి.? అప్పుడు ఆ వెలికి మాటలు, ప్రవచనాల్లా తెలంగాణ ప్రజల గుండె లోతుల్లోకి వెళ్ళిపోవాలన్నారు. ఇప్పుడేమో, ‘తూచ్‌’ అనేస్తున్నారు. ఈ రెండు నాల్కల ధోరణి ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరం.

అసెంబ్లీ సాక్షిగా ఓ ప్రజా ప్రతినిథి మీద దాడి చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర సమితిది. ఇప్పుడేమో, సక్కంగా.. సల్లంగా.. తమనెవర్నీ విమర్శించొద్దని టీఆర్‌ఎస్‌ అధినేత వేడుకుంటోంటే, జనానికి కడుపుబ్బా నవ్వుకోవాలన్పించడంలో ఆశ్చర్యమేముంది.? ‘నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్షా..’ అంటూ విపక్షాలు, కేసీఆర్‌ మీద ఛలోక్తులు విసురుతున్నాయిప్పుడు.