కేసీఆర్.. ఆ మానవత్వం ఇప్పుడేమయ్యింది.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల కరోనా బారిన పడ్డారు.. కోలుకున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు, ఆయన తనయుడు.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కూడా అయిన కేటీఆర్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే. కరోనా వస్తే, పరిస్థితి ఏంటన్నది స్వయంగా అనుభవించాక కూడా, సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సుల్ని నిలిపివేసేలా కేసీఆర్ ఎలా నిర్ణయం తీసుకోగలిగారు.? అన్నదే ఇప్పుడెవరికీ అర్థం కాని ప్రశ్న.

ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కూడా మండిపడింది. అయితే, తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం అంబులెన్సుల విషయంలో. ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.. ఏపీ నుంచి అంబులెన్సుల ద్వారా వచ్చే కరోనా బాధితుల కోసం. మామూలుగా అయితే మంచి ఆలోచనే ఇది. కానీ, కోవిడ్ మార్గదర్శకాలంటూ.. ఈ కాల్ సెంటర్ ముసుగులో నిబంధనల్ని విధించడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ముందస్తు అనుమతి లేకుండా అంబులెన్సుల్లో కరోనా బాధితులు రావడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆసుపత్రి అనుమతి తీసుకుని, ఆ తర్వాత ఈ-పాస్ పొంది.. కరోనా బాధితులు అంబులెన్సుల్లో ఏపీ నుంచి తెలంగాణకు రావాలన్నమాట. ఇదెక్కడి నిబంధన.? అంటూ చాలామంది మండిపడుతున్నారు. ఇదేనా కేసీఆర్ కరోనా నేపథ్యంలో చూపే మానవత్వం.? అంటూ ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.

అయితే, తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేనందున, ఏపీ నుంచి అంబులెన్సుల్లో వచ్చేసే కరోనా బాధితులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనీ, పలు ఆసుపత్రుల చుట్టూ తిరగడం ద్వారా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారనీ ఈ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం కాల్ సెంటర్ నిర్ణయం తీసుకుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ అంటే మెడికల్ హబ్.. హెల్త్ టూరిజం విషయంలో అత్యున్నత స్థాయిలో వుంది. అలాంటప్పుడు.. కరోనా చెప్పి ఈ నిబంధనలేంటి.? పైగా, ఇది మానవత్వం కానే కాదు.