క్యాస్ట్ బ్యాలన్సింగ్ బాగానే ఉంది.

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా, గవర్నరు కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు టీఆరెస్ అభ్యర్థులను ప్రకటించింది.  పాత వారికి రెన్యువల్‌ చేస్తూ అదనంగా వచ్చే స్థానాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.  ఎమ్మెల్యే కోటా మూడు స్థానాలతో పాటు గవర్నర్‌ కోటా రెండు స్థానాలకు ప్రకటించి అభ్యర్థుల విషయంలో ఆయన చాలా బ్యాలన్సుగా వెళ్లారు.  టీఆర్‌ఎస్‌లో ఉండి పదవీకాలం పూర్తయిన ముగ్గురు ఎమ్మెల్సీలు వుల్లోల గంగాధర్‌ గౌడ్‌, ఫారూఖ్‌ హుస్సేన్‌, డి.రాజేశ్వరరావులకు రెన్యువల్‌ చేస్తూ కొత్తగా.. కాంగ్రెస్, ఎంఐఎంల ఎమ్మెల్సీల ప్లేసులో టీఆరెస్ నేతలకు ఛాన్సిచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రంగారెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్‌ అల్తాఫ్‌ హైదర్‌ రజ్వీల పదవీకాలం ఈ నెల 29తో ముగుస్తుండగా, వీరి స్థానాల్లో టీఆరెస్ నేతలకు అవకాశం దక్కింది.

భువనగిరికి చెందిన మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుడు, టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు ఎలిమినేటి కృష్ణారెడ్డికి, గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు కొత్తగా ఎమ్మెల్సీ ఛాన్స్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా ఎంపికైన మైనంపల్లి హన్మంతరావు, వుల్లోల గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డిలు మంగళవారం నామినేషన్‌ వేయనున్నారు. శాసనసభలో టీఆర్‌ఎస్‌కు మూడింటిని గెలుచుకునే బలం ఉండడంతో వీరి ఎన్నిక లాంఛనం కానుంది. గవర్నర్‌ కోటా స్థానాలకు ఇంకా నోటిఫికేషన్‌ రావాల్సి ఉంది.  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటా నుండి జరిగే ఎన్నికకు కాటేపల్లి జనార్దన్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఇప్పటికే తమ అభ్యర్థిగా ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి టీఆరెస్ మద్దతిస్తోంది.

కాగా అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ సామాజిక సమీకరణాలు బాగా కుదిరాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి పేరును కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పరిశీలించినా సామాజిక సమీకరణాల వల్ల ఆయనకు ఇవ్వలేదని చెబుతున్నారు.  మరోసారి ఖాళీ ఏర్పడినపుడు సుభాష్‌ రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే మొత్తం 7ఎమ్మెల్సీ స్థానాల్లో ముస్లిం సామాజిక వర్గానికి రెండు, రెడ్డి సామాజిక వర్గానికి రెండు, క్రిస్టియన్లకు ఒకటి, బీసీలకు ఒకటి, వెలమ సామాజిక వర్గానికి ఒకటి చొప్పున కేటాయించారు.