నిశ్శబ్ద విప్లవమట.. దుబ్బాకలో బీజేపీకి అంత సీనుందా.?

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి షాకిచ్చిన మాట వాస్తవం. కాంగ్రెస్‌ పార్టీ కూడా గట్టిగానే లోక్‌సభ సీట్లను గెల్చుకుంది. మొత్తంగా విపక్షాలకు ‘జీరో’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, లోక్‌సభ ఎన్నికలకు ముందు జోస్యం చెబితే, ఆ జోస్యం తప్పని ఓటర్లు నిరూపించేశారు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరింది. టీఆర్‌ఎస్‌, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది.. ఆ మాటకొస్తే హద్దులు దాటేస్తోంది కూడా.

తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందనీ, గెలుపు తమదేననీ జోస్యం చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకీ, అసెంబ్లీ ఎన్నికలకీ తేడా వుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కింది ఒకే ఒక్క సీటు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది స్పష్టంగా చెప్పేసిన ఎన్నికలవి. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటినా, బీజేపీ అనుకున్నంత స్థాయిలో తెలంగాణలో బలపడలేదన్నది నిర్వివాదాంశం.

ఇక, కిషన్‌రెడ్డి తాజా వ్యాఖ్యల విషయానికొస్తే, ‘కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయడం దండగ.. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచినా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచినా ఒకటే. ఒకవేళ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే, ఎటూ ఆయన టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోతాడు కదా..’ అంటూ కిషన్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదీ నిజమే. చాలామంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసేశారు మరి.

అలాగని బీజేపీ ఏమైనా ఈ తరహా చెత్త రాజకీయాలకు దూరంగా వుంటుందా.? అంటే, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎంపీల్ని (రాజ్యసభ) లాగేసుకోలేదూ.! ఒక్కటి మాత్రం నిజం.. ఓటర్ల మదిలో ఏముందనేది ముందస్తుగా ఎవరూ జోస్యం చెప్పలేరు. అలా చెప్పిన జోస్యాల్లో చాలావరకు బెడిసికొట్టాయి.. కొన్ని సందర్భాల్లో నిజమయినప్పటికీ.. కిషన్‌రెడ్డి జోస్యం ఏమాత్రం ఫలించేలా కన్పించడంలేదు.