అయ్యయ్యో.. లోకేష్‌ని వేస్ట్‌ ఫెలో అనేస్తారా కొడాలి నాని గారూ.!

మంత్రి కొడాలి నాని.. బూతులు చాలా అలవోకగా వాడేస్తారు. ఏమన్నా అంటే, ‘వున్నది వున్నట్లే మాట్లాడతాను.. నాకేమీ ఫిల్టర్‌ వుండదు.. అందరూ మాట్లాడుకునే భాషలోనే మాట్లాడతాను.. లోపల ఒకటి, బయట ఒకటి వుండదు నాకు..’ అని తెగేసి చెబుతారాయన.

ఇక, ఇప్పుడు మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి నారా లోకేష్‌ని ఉద్దేశించి ‘వేస్ట్‌ ఫెలో’ అనేశారు. ‘చేపల చెరువులకీ, వ్యవసాయం చేసే పంట పొలాలకీ తేడా తెలియని లోకేష్‌..’ అంటూ మంత్రి కొడాలి నాని విరుచుకుపడిపోయారు. మరి, టీడీపీ శ్రేణులు ఆగుతాయా.? కొడాలి నాని మీద సోషల్‌ మీడియా వేదికగా ఎడా పెడా ఆయనగారి భాషలోనే తిట్లదండకం అందేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.

ఎవరైనా నోరు జారడం చాలా తేలిక. ‘నాకు బూతులు బాగా వచ్చు.. నేను చాలా బాగా తిట్టగలను..’ అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటుండదు. అవును మరి, నువ్వు రెండు తిడితే, నాలుగు తిట్టడానికి అవతలి వ్యక్తులూ సిద్ధంగా వుంటారు. ఇక్కడ స్థాయిని దిగజార్చుకోవడమా.? వద్దా.? అన్నది వారి వారి విజ్ఞతను బట్టి వుంటుందన్నమాట.

లోకేష్‌పై నాని విమర్శల సంగతి పక్కన పెడితే, మాజీ మంత్రి దేవినేని ఉమపైనా విరుచుకుపడిపోయారు కొడాలి నాని. ‘రైతులకు బేడీలు వేశారని, నువ్వు బేడీలు వేసుకుంటావా.? గతంలో చంద్రబాబు, రైతుల్ని కాల్చి చంపించాడు.. నువ్వూ తుపాకీతో కాల్చుకుంటావా..’ అని విరుచుకుపడిపోయారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.

చంద్రబాబు, గతంలో విద్యుత్‌ సమస్యపై రైతుల మీద పోలీసుల్ని ఉసిగొల్పిన మాట వాస్తవం. మరి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏం చేశారట.? ఆయన హయాంలోనూ ముదిగొండ కాల్పుల ఘటన జరిగింది. ఇక్కడ విషయం రైతులు నష్టపోవడం గురించి. చంద్రబాబు హయాంలో ఏం చేశారు.? అని కొడాలి నాని ప్రశ్నిస్తే, ప్రజలెందుకు చంద్రబాబుని కాదని వైఎస్‌ జగన్‌ని ముఖ్యమంత్రిని చేసినట్లు.? అయినా, రైతులకు బేడీలేయడమేంటి.? చేసిన తప్పుకి పోలీసు ఉన్నతాధికారులే దిగొచ్చి, బాధ్యులైన పోలీసు సిబ్బందిపై చర్యలు చేపట్టారు. ఆ విషయం కొడాలి నాని మర్చిపోతే ఎలా.?