కోన వెంక‌ట్‌కు శ్రీను వైట్ల థ్యాంక్స్‌

డైరెక్ట‌ర్ చూస్తే అంత‌గా ఫామ్‌లో లేడు. హీరోకు హిట్టంటే ఏంటో తెలియ‌దు. సినిమాను నిర్మిస్తున్న నిర్మాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు. సినిమా మ‌ధ్య‌లో ఆగిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అతి క‌ష్టం మీద డ‌బ్బులు స‌మ‌కూర్చుకుని ఎలాగోలా సినిమా పూర్తి చేశారు. రిలీజ్ ముంగిట స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. బ‌డ్జెట్‌కు త‌గ్గ బిజినెస్ ఆఫ‌ర్లు లేవు.

సినిమా రిలీజ‌వ్వ‌డ‌మే గ‌గనంగా ఉంది. ఇలాంటి ఎన్నో అడ్డంకుల్ని అధిగ‌మించి ఆ సినిమా రిలీజైంది. కానీ రిలీజ్ త‌ర్వాత మాత్రం ఆ సినిమా ఒక కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. ప్రేక్ష‌కుల్ని న‌వ్వుల్లో ముంచెత్తి.. ట్రెండ్ సెట్ చేసింది. తెలుగులో ఒక కొత్త త‌ర‌హా కామెడీకి బాట‌లు ప‌రిచింది. ఆ సినిమాతో తెలుగు సినిమాల్లో కామెడీ మ‌రో స్థాయికి చేరింది. ఇంత‌లా సంచ‌ల‌నం రేపిన ఆ సినిమా ఢీ.

శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన ఢీ సినిమా రిలీజై 13 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా అప్ప‌టి ఆన్ లొకేష‌న్ ఫొటో ఒక‌టి షేర్ చేసిన శ్రీను వైట్ల చాలా ఎమోష‌న‌ల్ అవుతూ ట్వీట్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌తి రోజూ ఒక ఛాలెంజే అంటూ అప్ప‌టి ఆర్థిక ఇబ్బందుల్ని చెప్ప‌క‌నే చెప్పాడు వైట్ల‌.

సినిమాలో న‌టించిన అంద‌రితో పాటు టెక్నీషియ‌న్ల‌కూ థ్యాంక్స్ చెప్పాడు. అందులో కోన వెంక‌ట్ పేరు కూడా ఉండ‌టం విశేషం. ఈ ఇద్ద‌రు మిత్రుల‌కు కొన్నేళ్లుగా ప‌డ‌క‌పోవ‌డం, ఈ మ‌ధ్య కూడా ఓ ఇంట‌ర్వ్యూలో వైట్ల‌ను కోన విమ‌ర్శించ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోన పేరును వైట్ల ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తి రేకెత్తించింది.

మ‌రోవైపు మంచు విష్ణు కూడా ఒక ఫొటో షేర్ చేసి నాటి అనుభూతుల్ని గుర్తు చేసుకున్నాడు. ఆ ట్వీట్లో త‌న పేరు లేక‌పోవ‌డంతో న‌న్ను మ‌రిచిపోయావా అంటూ జెనీలియా లైన్లోకి వ‌చ్చింది. నిన్నెలా మ‌రిచిపోతా.. ఆ ఫొటోలో నువ్వు లేవా అని విష్ణు అన్నాడు.

త‌న ట్వీట్ చివ‌ర్లో ఢీ-2 సంగ‌తేంటి అంటూ వైట్ల‌ను ప్ర‌శ్నించి ఊరుకున్నాడు విష్ణు. వీళ్ల క‌ల‌యిక‌లో ఢీ-2కు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో నిజంగానే ఈ సీక్వెల్ తెర‌కెక్కుతుందేమో చూడాలి.