జస్ట్‌ ఆస్కింగ్‌: ఎన్టీఆర్‌పై కేటీఆర్‌కి ప్రేమ పుట్టుకొచ్చిందెలా.!

‘పీవీ నరసింహారావు.. నందమూరి తారకరామారావు.. ఇద్దరూ చాలా గొప్ప నాయకులు.. ఒకరు దేశ ప్రధానిగా పనిచేశారు.. ఇంకొకరు ముఖ్యమంత్రిగా పనిచేశారు.. వారి ఘాట్లను కూల్చేస్తామనడం సబబు కాదు..’ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సోషల్‌ మీడియా వేదికగా చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, ఎన్టీఆర్‌ ఘాట్‌ని కూల్చేస్తామన్నారు కొందరు.. అంతేనా, తెలంగాణకు ఎన్టీఆర్‌ తీరని అన్యాయం చేశారనీ సెలవిచ్చారు.

సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్వర్గీయ ఎన్టీఆర్‌పైనా పరోక్షంగా విమర్శలు చేశారు… ఆంధ్రా పాలకులందరూ తెలంగాణని దోచుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ తక్కువేమీ తిన్లేదు.. తనవంతుగా ఎన్టీఆర్‌పై విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. స్వర్టీయ ఎన్టీఆర్‌ పేరు అవసరమొచ్చింది.. అందుకే, ఆయన మీద అమితమైన ప్రేమ కురిపించేస్తున్నారు. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఎలాగైనా నాలికని మడతబెట్టేస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలు జరుగుతున్న దరిమిలా, స్వర్గీయ ఎన్టీఆర్‌ అభిమానుల ఓట్ల కోసం కేటీఆర్‌కి స్వర్గీయ ఎన్టీఆర్‌ మీద అభిమానం పుట్టుకొచ్చేసింది. మిత్రపక్షం మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, ‘అక్రమ కట్టడాల్ని కూల్చేస్తామంటున్నారు.. ఎన్టీఆర్‌ ఘాట్‌, పీవీ ఘాట్‌లను కూల్చేయగలరా.?’ అని సవాల్‌ విసరడాన్ని, కేటీఆర్‌.. రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. మజ్లిస్‌కి సుద్దులు చెప్పారు. ఇంకోపక్క, టీఆర్‌ఎస్‌ వాహనాలపై మజ్లిస్‌ అభ్యర్థులు ప్రచారం చేస్తున్న వైనానికి సంబంధించి ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ దేశీయ టెర్మినల్‌కి స్వర్గీయ ఎన్టీఆర్‌ పేరు పెడితే, ‘ఏం.. మమ్మల్ని రెచ్చగొడతారా.? ఆంధ్రోళ్ళ పేర్లెందుకు.. మా తెలంగాణలో గొప్పోళ్ళెవరూ లేరా.?’ అని కేసీఆర్‌, అసెంబ్లీ సాక్షిగా.. ముఖ్యమంత్రి హోదాలోనే విమర్శించిన వైనం అందరికీ గుర్తుండే వుంటుంది.ఇది సోషల్‌ మీడియా రాజ్యమేలుతున్న కాలం. పాత విషయాల్ని తాము మర్చిపోయి, జనాన్ని ఏమార్చాలనుకుంటే కుదరదిక్కడ.

తెలంగాణ సెంటిమెంట్‌ రగల్చడానికి ఎన్టీఆర్‌ పేరు అవసరమయ్యింది.. ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల్లో గెలవడానికీ ఎన్టీఆర్‌ పేరు అవసరమవుతోంది.. అప్పట్లో అది విమర్శించడానికి.. ఇప్పుడు పొగడటానికి.. అంతే తేడా.! అయితే, స్వర్గీయ ఎన్టీఆర్‌ని పలు సందర్భాల్లో కేసీఆర్‌ పొగిడారు కూడా. తెలంగాణ పాఠ్య పుస్తకాల్లోనూ ఎన్టీఆర్‌కి చోటు కల్పించారు.

ఇదిలా వుంటే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్‌, టీఆర్‌ఎస్‌కి గుడ్‌ బై చెప్పి, బీజేపీలో చేరిపోయారు. ఉద్యమకారులకు అన్యాయం, అవమానం జరుగుతోందనీ.. ఈ కారణంగానే తాను టీఆర్‌ఎస్‌ని వీడాననీ స్వామిగౌడ్‌ చెబుతున్నారు. శాసన మండలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్‌ గతంలో పనిచేసిన విషయం విదితమే.