పీకే టీంకు ఫీల్డ్‌లో చుక్కలు కనిపిస్తున్నాయట

ప్ర‌శాంత్ కిశోర్‌…దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ‌నాయకుల‌కు సుప‌రిచిత‌మైన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌. ఇటీవ‌ల తెలుగుగ‌డ్డ‌పై సైతం ఆయ‌న పాపుల‌ర్ అయిపోయారు. ఏపీ ప్ర‌ధాన ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి 2019లో సీఎం కావాల‌నే ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ఎంచుకున్న తురుపుముక్క ప్ర‌శాంత్ కిశోర్ కావ‌డం వ‌ల్ల ఈ పాపులారిటి ద‌క్కింది. వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ప్లీన‌రీలో కూడా ప‌రిచ‌యం చేయ‌డం ద్వారా పీకే ప్రాధాన్య‌త‌ను వైఎస్ జ‌గ‌న్ చాటిచెప్పారు. అనంత‌రం వైసీపీ బ‌లం గురించి అంచనా వేసేందుకు, భ‌విష్య‌త్ వ్యూహాల‌ను సిద్ధం చేసేందుకు పీకే క్షేత్ర‌స్థాయి టూర్ మొద‌లుపెట్టారు. అయితే ఈ టూర్‌లో చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌శాంత్ కిశోర్‌ టీం శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేం. ఎందుకంటే ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి న‌రేంద్ర మోడీని ప్రొజెక్ట్ చేయ‌డం, నితీశ్ కుమార్‌ను మ‌రో ద‌ఫా సీఎం ప‌ద‌వి ద‌క్కే ఎత్తుల్లో పీకే సార‌థ్యంలోని బృందం విజ‌య‌వంతం అయింది. అయితే ఏపీలో మాత్రం భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ బ‌లాబలాల‌ను తేల్చేందుకు పీకే టూర్ మొద‌టి ద‌శ‌లో క‌డ‌ప‌లో, అనంత‌రం నెల్లూరులో ప‌ర్య‌టిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా పీకే టీం స‌భ్యుల‌కు భాష స‌మ‌స్య ఎదుర‌వుతోంద‌ట‌. పీకే టీంలో ఉన్న వారిలో దాదాపుగా అంద‌రూ ఇంగ్లిష్‌, హిందీ మాత్ర‌మే మాట్లాడేవారు. దీంతో తెలుగులో సంభాషించ‌లేక‌పోతున్నారు. దీంతో స‌హ‌జంగానే వారు ప్ర‌జ‌ల‌తో వారు మ‌మేకం కాలేక‌పోతున్నారు. త‌ద్వారా అస‌లు వైసీపీ బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు, తెలుగుదేశం పార్టీ అనుకూల‌మైన అంశాలు, ఇత‌ర‌త్రా విష‌యాల గురించి విన‌డం, తెలుసుకోవ‌డంలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయట‌.

దీంతోపాటు ప్ర‌శాంత్ కిశోర్ బృందాన్ని బుట్ట‌లో వేసుకునేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌శాంత్ కిశోర్‌కు స‌హ‌క‌రించాల‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పార్టీ శ్రేణుల‌కు స్పష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు పీకే ఫీల్డ్ టూర్‌లో వెంట ఉంటున్నాయి. అయితే ఈ క్ర‌మంలో పీకే బృందానికి ఎదుర‌వుతున్న భాష స‌మ‌స్య‌ను కొంద‌రు వైసీపీ నేత‌లు అనుకూలంగా మార్చుకుంటున్నార‌ట‌. ఆయా చోట్ల పార్టీ వాస్త‌వ ప‌రిస్థితి కంటే తమ నాయ‌కుడికి సానుకూల‌మైన అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నార‌ని అంటున్నారు. మొత్తంగా పీకే టీంకు ఆదిలోనే ఏపీ పాలిటిక్స్‌లోని చిత్ర‌విచిత్ర ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయ‌ని చెప్తున్నారు.