లోకేష్‌బాబూ.. ఈ గోచీల గోలేంటి.?

ప్రజలకి అన్నీ తెలుసు… ఎవర్ని ఎప్పుడు ఎక్కడ వుంచాలో ప్రజలకు తెలుసు కాబట్టే, రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తుంటారు.. పోతుంటారు. ఎన్నికల్లో నాయకుల గెలుపోటముల్ని నిర్ణయించేది ప్రజలే. ప్రలోభాల సంగతి పక్కన పెడితే, ఎవరికి ఎప్పుడెలా వాత పెట్టాలన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు. అయితే, దానికి ఎన్నికలు వచ్చేదాకా ప్రజలు వేచి చూడాల్సి వస్తోందిప్పుడు.. అంతే తేడా.!

అసలు విషయానికొస్తే, మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేష్‌, ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని గోచీతో నిలబెట్టే రోజులు వస్తాయి.. ప్రజలే ఆ పని చేస్తారు..’ అంటూ విమర్శించేయడం ఇప్పుడు రాజకీయంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది.

భవిష్యత్తులో వైఎస్‌ జగన్‌ పరిస్థితి ఏంటి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించడం ద్వారా.. ప్రజలు ‘మిమ్మల్ని గోచీతోనే నిలబెట్టారు..’ అన్న చర్చ జరుగుతోందిప్పుడు. ఈ తరహా వ్యాఖ్యలు ఎవరు చేసినా, సభ్యత అన్పించుకోదు. వైసీపీ నేతలూ ఈ విషయంలో తక్కువేం తిన్లేదు.. టీడీపీకి జరిగిన పరాభవం గురించి గట్టిగా మాట్లాడేస్తుంటారుగానీ.. తమకు ఎదురయ్యే పరాభవం గురించి ఊహించుకోరు.

2014 ఎన్నికల్లో వైసీపీ గతి ఏంటి.? అన్నది వైసీపీ నేతలు ఆలోచించుకుంటే, టీడీపీ మీదనో, ఇంకో పార్టీ మీదనో ‘స్థాయిని దిగజార్చేసుకుని’ వ్యాఖ్యలు చేయరు కదా.! టీడీపీ కూడా అంతే. ఒక్కటి మాత్రం నిజం.. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రతి చిన్న విషయానికీ కులాన్ని ఆపాదించడం జరుగుతోంది. రైతులకు సైతం కులాల్ని ఆపాదిస్తున్నారు వైసీపీ నేతలు. అధికారులకు కులాన్ని అంటగట్టడం అనేది కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ విషయాల్ని లోకేష్‌ ప్రస్తావించడాన్ని తప్పు పట్టలేం.

ప్రతిపక్షంలో వున్నారు గనుక, ఆయనకి ఆ బాధ్యత వుంది. కానీ, ‘గోచీ’ వ్యాఖ్యలేంటి.. సంస్కార హీనంగా వ్యాఖ్యానించడం కాకపోతే. ఇదిలా వుంటే, రైతుల వస్త్రధారణని మంత్రులు ఎగతాళి చేస్తున్న దరిమిలా, వారిని అదుపు చేయడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద వుందన్నదీ నిర్వివాదాంశం. ఎవరికి వారు తమ స్థాయిని మర్చిపోతే.. రాజకీయ నాయకులకు ‘సంస్కారం’ నేర్పేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తారు మరి.!