సీఎం హెలికాప్ట‌ర్ క్రాష్ అయ్యింది…కానీ

నరేంద్ర మోడీ మెచ్చిన యంగ్ సీఎం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయింది.  ప్రమాదం కూడా తీవ్రమైనదే… హెలికాప్టర్ రెక్కలన్నీ విరిగిపోయాయి.. రెండు తలుపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే, ఈ పెను ప్రమాదం నుంచి సీఎం మాత్రం క్షేమంగా బయటపడ్డారు.

కాగా హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి ఆనుకునే ఇళ్లు ఉన్నాయి.  ఓ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ వైర్లు ఉన్నాయి. చాపర్ దిగుతూనే విమానం రెక్కలు పక్కనున్న రేకుల షెడ్ గోడకు తగిలి విరిగిపోయాయి. వీటి ధాటికి పక్కనే ఉన్న ఓ లారీ అద్దాలు పగిలిపోయాయి. విమానం తోకకు ఉండే ఫ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది.  హెలికాప్టర్ అద్దాలు పగిలిపోయాయి. అయితే, హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చివరి క్షణంలోనే ఇదంతా జరగడం, ఆపై అది కేవలం ఒకటి, రెండు మీటర్ల ఎత్తునుంచే కింద నిట్టనిలువుగా పడటంతోనే అందులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు.

కాగా ఈ ప్రమాదంలో ఫడ్నవీస్ కు గాయాలేమీ కాలేదని చెబుతున్నారు. మరోవైపు తాను సేఫ్‌గా ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని ఫడ్నవీస్‌ ట్వీట్‌ కూడా చేశారు. సీఎంతో పాటు అందులో ఉన్న అధికారులు కూడా  సేఫ్‌గా బయటపడినట్లు సమాచారం.  హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు మహారాష్ర్ట సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.