మహేష్‌కిది పర్‌ఫెక్ట్‌ సెట్టింగా?

తమిళ మార్కెట్‌ని క్యాప్చర్‌ చేయాలని మహేష్‌బాబు చాలా కాలంగా చూస్తున్నాడు. పలువురు ప్రముఖ తమిళ దర్శకులతో పని చేసే అవకాశాలు కూడా అతడిని వరించాయి కానీ ఎందుకో మహేష్‌కి అప్పుడు కుదర్లేదు.

శంకర్‌, మణిరత్నంలాంటి దిగ్గజాలు కూడా అతనితో పని చేద్దామని అనుకున్నారు. గౌతమ్‌ మీనన్‌, లింగుస్వామి తదితర దర్శకులు అదే పనిగా మహేష్‌ని వెంటాడారు. అయితే ముందుగా మురుగదాస్‌తో కుదిరింది. నిజానికి ఈ కథ మహేష్‌కిచ్చి, తన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని ఇంట్రడ్యూస్‌ చేయమని అడుగుదామని మురుగదాస్‌ భావించాడు.

కానీ మురుగదాస్‌తో అయితేనే చేస్తానని మహేష్‌ చెప్పడంతో ‘స్పైడర్‌’ మొదలైంది. మురుగదాస్‌ కూడా తమిళనాడులో చాలా పెద్ద బ్రాండే. రమణ, గజిని, తుపాకి, కత్తి… ఇలా చాలా బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు. అతని చిత్రానికి ఖచ్చితంగా భారీ హంగామా వుంటుంది. కనుక తమిళ రంగ ప్రవేశానికి మహేష్‌ ఏమీ అల్లాటప్పా సినిమా ఎంచుకోలేదు. ఈ చిత్రంతో తనకి తమిళనాడులో సాలిడ్‌ మార్కెట్‌ ఏర్పడుతుందని, ఇకపై తన సినిమాలన్నీ ప్యారలల్‌గా అక్కడ రిలీజ్‌ చేయవచ్చునని మహేష్‌ భావిస్తున్నాడు.

ఇంతకుముందు శ్రీమంతుడుతో ట్రై చేసాడు కానీ అక్కడి వారి నుంచి స్పందన లేదు. ఈసారి మురుగదాస్‌ దర్శకుడు కనుక ఈ చిత్రాన్ని లైట్‌ తీసుకోలేరు. ఎలా చూసినా ఇది మహేష్‌కి పర్‌ఫెక్ట్‌ సెట్టింగ్‌ అనే చెప్పాలి.