కొత్త భాషలోకి మహేష్ సినిమా

మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలోకి అనువాదం చేసి విడుదల చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఐతే దీంతో పాటు ఓ కొత్త భాషలోనూ ‘స్పైడర్’ రిలీజవుతుండటం విశేషం. ఈ చిత్రాన్ని అరబిక్ భాషలోకి అనువాదం చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మురుగదాసే స్వయంగా వెల్లడించాడు.

ప్రస్తుతం ‘స్పైడర్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ డబ్బింగ్ తో పాటుగా అరబిక్ భాష డబ్బింగ్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయట. గల్ఫ్ కంట్రీస్‌లో ‘స్పైడర్’ను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనున్నారు. తెలుగు, తమిళంలో కంటే అరబిక్‌లో అనువాదం చేసిన నేరుగా రిలీజ్ చేస్తే రెస్పాన్స్ మరింతగా ఉంటుందని భావిస్తున్నారు.

మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. మరో తమిళ నటుడు భరత్ కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. తనకున్న ప్రత్యేక శక్తితో వైపరీత్యాలకు కారణమయ్యే విలన్ ఆటకట్టించే స్పై పాత్రలో నటించనున్నాడు మహేష్ ఇందులో. హ్యారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు. సెప్టెంబరు 9న చెన్నైలో జరిగే పెద్ద ఈవెంట్ సందర్భంగా ‘స్పైడర్’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు.