క‌లెక్ట‌ర్ అబ‌ద్ధాలు చెప్ప‌మంటే.. మంత్రి వ‌ద్ద‌న్నారు

ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయ్యింది. సాధార‌ణంగా రాజ‌కీయ నేత‌ల మాట‌ల్లో చూసీచూడ‌న‌ట్లుగా ఉండ‌మ‌ని.. చిన్న చిన్న త‌ప్పులు చేయొచ్చ‌ని మాట వ‌ర‌స‌కు చెప్పేస్తుంటారు. అదే స‌మ‌యంలో అధికారులు స‌సేమిరా అనేయ‌టం క‌నిపిస్తుంటుంది. కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతంలో ఈ వ్య‌వ‌హారం కాస్త భిన్నంగా క‌నిపిస్తుంది. బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న జిల్లా క‌లెక్ట‌ర్ విద్యార్థుల్ని అబ‌ద్ధాలు చెప్పేయ‌మంటే.. అదే స‌భ‌లో ఉన్న ఉప ముఖ్య‌మంత్రి వ‌ర్యులు మాత్రం నో.. నో.. అలా ఎలా అబ‌ద్ధాలు చెబుతారు.. అస్స‌లు చెప్పొద్దు సుమా అంటూ స్ప‌ష్టం చేశారు. ఇంత‌కీ ఆ క‌లెక్ట‌ర్ ఎవ‌రు? ఆ ఉప ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌న్న విష‌యంలోకి వెళితే..

వ‌రంగ‌ల్ లోని ములుగు రోడ్డులో జాబ్‌మేళా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి.. జిల్లా క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూల‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశంపై క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి మాట్లాడుతూ.. ఉద్యోగం రావాలంటే కొన్ని అబ‌ద్ధాలు చెప్ప‌క త‌ప్ప‌ద‌ని.. లేదంటే ఉద్యోగం రాద‌ని వ్యాఖ్యానించారు. స‌ర్టిఫికేట్లు.. మార్కుల ప‌రంగా కాకుండా ప‌ని చేసే సామ‌ర్థ్యం గురించిన విష‌యాల్లో అబ‌ద్ధాలు చెప్ప‌క త‌ప్ప‌ద‌న్నారు. క‌లెక్ట‌ర్ స్థానంలో ఉన్న అధికారిణి నోటి నుంచి ఈ మాట‌లు రావ‌టంతో అక్క‌డి వారు ఆశ్చ‌ర్య‌పోయారు. ఎంత ప్రాక్టిక‌ల్ గా ఉంటే మాత్రం ఇలాంటి మాట‌లు ఎలా చెబుతార‌న్న మాట వినిపించింది.

అనంత‌రం మాట్లాడిన ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి.. క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి చెప్పిన మాట‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేశారు. ఉద్యోగం కోసం వెళ్లే వారు ఎవ‌రూ అబ‌ద్ధాలు అస్స‌లు చెప్ప‌కూడ‌ద‌న్నారు. అబ‌ద్ధాలు చెబితే దొరికిపోతార‌ని.. వ‌చ్చే ఉద్యోగం కూడా రాకుండా పోతుంద‌న్నారు. ఇంట‌ర్వ్యూను ప్ర‌తిభ‌తో ఎదుర్కోవాలే కానీ.. అబ‌ద్ధాల‌తో కాదని.. అలా చేస్తే అడ్డంగా దొరికిపోతార‌న్నారు. తెలివిక‌ల అధికారి బోర్డులో ఉంటే దొరికిపోవ‌ట‌మే కాదు.. రావాల్సిన ఉద్యోగం కూడా రాకుండా పోతుంద‌ని హెచ్చ‌రించారు. ఒకేస‌భ‌లో ఇద్ద‌రు ప్ర‌ముఖులు చెప్పిన మాట‌ల్లోని భిన్న‌త్వం అక్క‌డి వారిని కాసింత అయోమ‌యానికి గురి చేసింద‌ని చెప్ప‌క త‌ప్పుదు. అయినా.. అమ్ర‌పాలి.. ఇదేంట‌మ్మా.. పిల్ల‌ల‌కు ఇలాంటి మాట‌లు చెప్ప‌టం ఏమిటి?