మా సంగతి సరే.. మీ బుద్ధేమైంది..?

ఎయిరిండియా.. కొన్నాళ్లుగా నష్టాల్లో కూరుకుపోతోంది. అయితే గత ఏడాది మాత్రం కేంద్రం, ఎయిర్ ఇండియా యాజమాన్యం, ఉద్యోగులు కష్టపడి పనిచేయడంతో నిర్వహణ లాభాలొచ్చాయి. అయినా ఎయిరిండియాలో ఇంకా ఉద్యోగుల నిర్లక్ష్యం ఉందని, మారకపోతే సంస్థ మనుగడే కష్టమని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో అశోక్ గజపతిరాజుపై ఎయిరిండియా ఉద్యోగులు కోపం పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఓ పైలట్ రాసిన లేఖ ఆ కోపానికి అద్దం పడుతోంది. విమానయాన మంత్రిగా సిబ్బందికి నీతులు చెప్పే ముందు.. ఎంపీల సంగతి చూడాలని చురకంటించారు. వింటర్ సెషన్ తుడిచిపెట్టుకుపోవడంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎయిరిండియా పైలట్ సుభాశిష్ మజుందార్.. విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజుకు ఘాటుగా లేఖ రాశారు. ఎయిరిండియా ఉద్యోగులకు నిబద్ధత లేదంటున్న మంత్రిగారు.. తమ సహచర ఎంపీల గురించి కాస్త ఆలోచించాలన్నారు. వింటర్ సెషన్ తుడిపెట్టుకుపోవడం రాజకీయ నేతల నిబద్ధతనే ప్రశ్నార్థకం చేసిందన్నారు మజుందార్.

ఇతర దేశాలతో పోలిస్తే మన రాజకీయ నేతలు ఎప్పుడూ సరిగ్గా వ్యవహరించడం లేదని, అది మరోసారి ప్రూవ్ అయిందని మజుందార్ మండిపడ్డారు. సభ జరగకుండా దేశం మొత్తాన్ని నిరాశపరిచిన నేతలకు.. ఇతరుల నిబద్ధత గురించి ప్రశ్నించే అధికారం లేదన్నారు. కేవలం అశోక్ గజపతి రాజు గురించి మాత్రమే కాదని.. అందరి గురించీ మాట్లాడుతున్నానని చురకంటించారు మజుందార్.