అంబేద్కర్ వర్సెస్ అమరావతి.! కావాలా.? వద్దా.?

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలా.? వద్దా.? ఒక్కటే ప్రశ్న.. సరైన సమాధానం విపక్షాలు చెప్పాల్సిందేనని మంత్రి రోజా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుండాలా.? వద్దా.? అని రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. పోనీ, ఆ రాజధానికి అమరావతి అని కాకుండా, అంబేద్కర్ అని పేరు పెట్టుకుని అభివృద్ధి చేసి చూపించండి.. అన్నది ఇంకొందరి వాదన.

రాజధాని అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని చంద్రబాబు హయాంలో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అది కార్యరూపం దాల్చలేదు. టీడీపీ తలపెట్టిన చోట కాకుండా, ఇంకెక్కడో విగ్రహాన్ని పెట్టబోతున్నట్లు వైసీపీ ప్రభుత్వం హంగామా చేసింది. అదెక్కడో కాదు, విజయవాడలో. పోనీ, ఆ విగ్రహమైనా పూర్తయ్యిందా.? లేదాయె.!

తమ సొంత పబ్లిసిటీ కోసం పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, న్యూస్ ఛానళ్ళలో వీడియోలూ వదులుతున్న వైసీపీ ప్రభుత్వం, ఆ ఖర్చుతో అయినా, అంబేద్కర్ విగ్రహాన్ని కట్టేసి వుండొచ్చు. కానీ, కట్టలేదాయె. అంతెందుకు.? ముఖ్యమంత్రి సొంత జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టుకుని, అందరికీ ఆదర్శంగా వుండాలి కదా.? అదీ చేయలేదాయె.!

గడచిన మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఘనంగా అమలు చేసేశామని చెప్పుకుంటోన్న ఒక్క సంక్షేమ పథకానికైనా అంబేద్కర్ పేరు పెట్టారా.? లేదాయె.? అప్పుడు అక్కరకు రాని అంబేద్కర్ పేరు, కోనసీమ జిల్లా విషయంలోనే ఎందుకు వచ్చిందట.?

మూడు రాజధానులంటూ పబ్లిసిటీ స్టంట్లు చేశారు. చివరికి అవి పబ్లిసిటీ స్టంట్లుగానే మిగిలిపోయాయ్.! అయినా, కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టేస్తే.. ఆ మహనీయుడ్ని ఉద్ధరించేసినట్లేనన్న భావనలో అధికార పార్టీ వుండడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

చివరగా, పవన్ కళ్యాణ్‌ని తాము రాజకీయ నాయకుడిలా చూడటం లేదని మంత్రి రోజా సెలవిచ్చారు. అసలు వైసీపీలోనే, వైసీపీ మంత్రులకు తగిన గుర్తింపు వుందా.? అన్న చర్చ జరుగుతోంది. మరి, ఈ విషయంలో రోజా, సొంత నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో పంచాయితీ పెట్టుకుంటే బావుంటుందేమో.!