గురువుకు మోడీ భారీ గురుదక్షిణ

విమర్శకులకు పెద్ద పనే పెట్టారు ప్రధానమంత్రి మోడీ. అవసరం తీరిన తర్వాత అవతల పాడేయటం మోడీకి కొత్త కాదని.. అందుకు గురువు కూడా మినహాయింపు కాదంటూ ఇంత కాలం విరుచుకుపడిన విమర్శకుల నోటికి ఇక తాళాలు పడినట్లే. బీజేపీ కురువృద్ధుడు లాక్ కృష్ణ అద్వానీ విషయంలో మోడీ చేసిన అన్యాయాన్ని పలువురు తీవ్రంగా తప్పు పట్టటమే కాదు. మోడీ తీరే అలా ఉంటుందని మండిపడుతుంటారు.

తనను పైకి తీసుకొచ్చిన అద్వానీని సైతం పక్కన పెట్టేసి.. పెద్దాయన మనసును తీవ్రంగా గాయపర్చేందుకు సైతం వెనుకాడని తత్త్వం మోడీ సొంతమని చాలామంది విమర్శిస్తారు. మోడీ బాధితుల జాబితాలో గురువు అద్వానీ కూడా ఉన్నారంటూ పెద్ద ఉదాహరణనే చెబుతుంటారు. ఇలాంటి విమర్శలు చేసే వారు ఇకపై..అలాంటి మాటల్ని అనే ముందు ఒకటికి రెండుమార్లు ఆలోచించి అనాల్సి ఉంటుందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. తన గురువుకు భారీ గురుదక్షిణను చెల్లించుకోవటానికి మోడీ సిద్ధమయ్యారని.. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే తన నోటితో చెప్పినట్లుగా చెబుతున్నారు.

ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలన్నది అద్వానీ ఆశ. అది నెరవేరని నేపథ్యంలో.. కనీసం రాష్ట్రపతి కుర్చీలో కూర్చునే అవకాశం ఉంటుందా?అని ఆయన ఫీల్ అయ్యేవారని చెబుతుంటారు. అయితే.. ఎప్పుడూ తన మనసులోని మాటను ఆయన బయటకు చెప్పింది లేదు. అయితే.. పార్టీని ఇంతగా పెంచి పెద్ద చేసిన అద్వానీని సముచితంగా గౌరవిస్తే బాగుంటుందన్న భావన బీజేపీలోని ప్రతి కార్యకర్తా.. అభిమానికి ఉంది అయితే.. అందుకు సుముఖంగా లేనట్లు మోడీ తీరు ఉండేది. దీంతో.. మోడీకి వ్యతిరేకంగా నోరు విప్పేందుకు ఎవరూసాహసించే వారు కాదు.

అయితే..తాను సరైన సమయం కోసమే ఎదురు చూస్తున్నాను  తప్పించి.. తన గురువు మీద తనకు అచంచలమైన ప్రేమాభిమానాలు ఉన్నాయన్న విషయాన్ని తాజాగా తన మాటలతో తేల్చేశారు మోడీ. గుజరాత్ లోని సోమనాథ్ లో జరిగిన బీజేపీ సమావేశంలో అద్వానీని రాష్ట్రపతిని చేయాలన్న విషయాన్నిమోడీనే స్వయంగా చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఈ సమావేశానికి అద్వానీతో పాటు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. కేశూభాయ్ పటేల్ కూడా హాజరయ్యారు. మోడీ మాటకు అద్వానీ భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి పదవిని తన రాజకీయ గురువుకు గురుదక్షిణగా ఇవ్వనున్నట్లుగా మోడీ చెప్పినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి పదవిలో ఉన్న ప్రణబ్ దా పదవీ కాలం ఈ జులై 25తో ముగుస్తుంది. తర్వాత జరిగే ఎన్నికల్లో అద్వానీని గెలిపించుకునేంత మెజార్టీ.. తాజాగా గెలుపొందిన యూపీతో పాటు.. ప్రభుత్వాన్నిఏర్పాటు చేసిన మణిపూర్.. గోవా.. ఉత్తరాఖండ్ పుణ్యమా అని సాధ్యమవుతుందని చెబుతున్నారు. మెజార్టీకి అవసరమైన కొద్ది ఓట్లను టీఆర్ఎస్..అన్నాడీఎంకే లాంటి పార్టీలతో తాము డిసైడ్ చేసిన రాష్ట్రపతి అభ్యర్థిని మోడీ గెలిపించుకునేఅవకాశం ఉందని చెప్పాలి. ఈమధ్య కాలంలో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న విషయంపై నెలకొన్న ఉత్కంటపై మోడీ తాజా తన మాటతో ఒక క్లారిటీ ఇచ్చేసినట్లేనని చెప్పక తప్పదు.