ముద్రగడకు ‘కాపు’ కాస్తున్నదెవరు.?

ముద్రగడ పద్మనాభం.. ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పారాయన. మంత్రిగానూ పనిచేశారు. అయితే, కాలక్రమంలో ఆయన రాజకీయంగా తన ప్రాబల్యాన్ని కోల్పోయారన్నది నిర్వివాదాంశం. ‘ముద్రగడ’ అన్న పేరు, కాపు సామాజిక వర్గంలో ఓ ‘బ్రాండ్‌’గా మారిపోయింది. ఆ కారణంగానే ‘కాపు రిజర్వేషన్ల కోసం’ ముద్రగడ గతంలో చేపట్టిన ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చింది.

అయితే, గతంలోలా ఆయన రాజకీయ వ్యూహాలు రచించలేక చతికిలపడుతున్నారు. అందుకు కాపు రిజర్వేషన్ల ఉద్యమం పక్కదారి పట్టడమే నిదర్శనం. కొన్నాళ్ళు వైసీపీ అధినాయకత్వం, కొన్నాళ్ళు టీడీపీ అధినాయకత్వం ముద్రగడ పద్మనాభంని ‘పావు’గా వాడుకుని, కాపు సామాజిక వర్గాన్ని గందరగోళంలో పడేశాయి. అలా కాపు సామాజిక వర్గం తరఫున బలమైన పోరాటం చేయలేకపోయినందుకు ముద్రగడ ఇప్పుడు తీరిగ్గా చింతించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చంద్రబాబు హయాంలో నానా రకాల రాజకీయాలూ చేసి, చివరికి కేంద్రం ఇచ్చిన ‘ఈబీసీ రిజర్వేషన్ల’ నుంచి కొంత వాటాని కాపు సామాజిక వర్గం వైపు మళ్ళించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక, ‘అది కుదరదు’ అనే పరిస్థితి వచ్చింది. మొత్తంగా చూస్తే, రిజర్వేషన్ల విషయంలో కాపు సామాజిక వర్గం, రెండు పార్టీల వెన్నుపోటుకు గురయ్యిందని చెబుతుంటారు రాజకీయ పరిశీలకులు. అడపా దడపా ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో ఇప్పటికీ హాట్‌ టాపిక్‌ అవుతూనే వున్నారు. తాజాగా మరో మారు ముద్రగడ పేరు తెరపైకొచ్చింది.

కాపు సామాజిక వర్గ పెద్దలు కొందరు, ‘రిజర్వేషన్ల పోరులో మీరు ముందుండి ఉద్యమాన్ని నడిపించండి..’ అంటూ ముద్రగడను కోరారు. కానీ, ఆ ప్రతిపాదనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించారు. ‘నా వల్ల కాదు’ అంటూ చేతులెత్తేశారు. చూస్తోంటే, ఇది మళ్ళీ ఓ పెద్ద డ్రామాలా కన్పిస్తోందన్న విమర్శలూ లేకపోలేదు. ‘కాపు సామాజిక వర్గానికి మేమే పెద్ద పీట వేశాం’ అంటారు టీడీపీ నేతలు. వైసీపీ నేతలు ‘అంతకు మించి’ అంటారు.

ఒక్కటి మాత్రం నిజం.. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో.. రెండు పార్టీలూ పండగ చేసుకున్నాయి, చేసుకుంటున్నాయి కూడా. రిజర్వేషన్ల వ్యవహారంపై.. ఈ రెండు పార్టీలకీ చిత్తశుద్ధి లేదు. ఈ విషయం అర్థమయ్యే.. ముద్రగడ ‘ఇక నా వల్ల కాదు’ అని చేతులెత్తేసినట్లు కన్పిస్తోంది. అయితే, ఇప్పటికీ అటు టీడీపీ నుంచి కొందరు, ఇటు వైసీపీ నుంచి కొందరు ఆయన్ని నడిపిస్తూనే వున్నారన్న విమర్శలూ లేకపోలేదు.