చిరంజీవికి కౌంటరేసిన నాగార్జున!

బాలకృష్ణ తర్వాత వంద సినిమాలు చేయడానికి స్కోప్‌ వున్న ఒకే ఒక్క హీరో నాగార్జున. సీనియర్‌ హీరోల్లో వెంకటేష్‌ 75 సినిమాలు ఇంకా కంప్లీట్‌ చేయలేదు కనుక ఆయనకి హీరోగా వంద సినిమాలు పూర్తి చేసే ఛాన్సులు తక్కువే.

ఆల్రెడీ తొంభై సినిమాలకి పైగా పూర్తి చేసిన నాగార్జున వందవ చిత్రంపై అభిమానులు ఆసక్తిగా వున్నారు. కానీ నాగార్జున మాత్రం తాను ఇంకా వంద చిత్రాలకి చేరువ కాలేదని తేల్చేసారు. అభిమానులు ఉత్సాహంతో తాను చేసిన అతిథి పాత్రలు కూడా లెక్కపెడుతున్నారని, కానీ అతిథి పాత్రలు లెక్కించడం సబబు కాదు కనుక, తన లెక్క తనకి వుందని, వంద సినిమాలకి దగ్గరైనపుడు తానే ఆ విషయం చెబుతానని, అలాగే వందవ చిత్రంగా ఏది చేయాలనే దానిపై కూడా తనకో ఐడియా వుందని నాగార్జున అన్నారు.

అతిథి పాత్రలు లెక్కించడం కరక్ట్‌ కాదంటే చిరంజీవికి ‘ఖైదీ నంబర్‌ 150’ నూట యాభైవ చిత్రం అవదు. ఆయన చేసిన అతిథి పాత్రలన్నీ లెక్కపెడుతూ వచ్చిన అభిమానులు ‘బ్రూస్‌లీ’ని మాత్రం వదిలేసారు. అతిథి పాత్రలు లెక్క పెడితే ‘బ్రూస్‌లీ’తోనే చిరు నూట యాభై చిత్రాలు పూర్తి చేసుకున్నారు. కానీ ల్యాండ్‌మార్క్‌ ఎఫెక్ట్‌ కోసం దానిని అసలు లెక్కలోకి తీసుకోలేదు. కానీ ‘మగధీర’లో చేసిన గెస్ట్‌ క్యారెక్టర్‌ మాత్రం అకౌంట్లోకి వచ్చింది.

అలా చూస్తే చిరంజీవి 150 సినిమాల లెక్క చాలా కాంట్రవర్షియల్‌ అవుతుంది. ఇదంతా ఎందుకని అనుకున్నాడో ఏమో అసలు అతిథి పాత్రలు సినిమాలుగా కౌంట్‌ అవ్వవని నాగార్జున స్పష్టం చేసారు. నాగ్‌ లెక్కలో చూసుకుంటే చిరంజీవి 150వ చిత్రానికి కూడా ఇంకా టైమ్‌ పడుతుంది మరి.