నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇటివల నాయిని కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో నగరంలోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 16 రోజులు చికిత్స అనంతరం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది.

అయితే.. ఆయనకు మళ్లీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయనకు మళ్లీ పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు న్యుమోనియా ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు గుర్తించారు. దీంతో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి ఆయనకు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో వెంటనే ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. నిపుణుల పర్యవేక్షణలో నాయినికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఇటివలే నాయిని భార్య అహల్య. అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి, మనవడికి కూడా కరోనా సోకింది. వీరంతా బంజారాహిల్స్‌ లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం వీరందరికీ నెగటివ్ గా తేలింది. ముషీరాబాద్‌లో జరిగిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమంతోపాటు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో నాయినికి కరోనా సోకినట్టు భావిస్తున్నారు.