నెక్స్‌ట్‌ ఏంటి…? నాలుగు రెడీ!

‘నేను లోకల్‌’ సినిమాలో ‘నెక్స్‌ట్‌ ఏంటి’ అని హీరోని అడిగితే విసుక్కున్నాడు కానీ నానిని అదే క్వశ్చన్‌ అడిగితే నెక్స్‌ట్‌ ఒక్కటేంటి, ఆల్రెడీ నాలుగు రెడీగా వున్నాయని చెప్తాడు. యమ స్పీడుగా సినిమాలు చేసేస్తున్న నాని వరుస విజయాలు ఇచ్చిన ఊపుతో ఇంకా వేగంగా సంతకాలు చేసి పారేస్తున్నాడు. అతని తదుపరి నాలుగు సినిమాలు ఖరారైపోయాయి.

శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నిన్ను కోరి’ ఇమ్మీడియట్‌గా రిలీజ్‌ అవుతుంది. దాని తర్వాత దిల్‌ రాజు బ్యానర్‌లో ‘ఎంసిఏ’ చేయబోతున్నాడు. హను రాఘవపూడి ఇప్పటికే తన తదుపరి చిత్రం నానితో వుంటుందని అనౌన్స్‌ చేసాడు. ఎక్స్‌ప్రెస్‌ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ మూడవ చిత్రం నానితో చేయబోతున్నాడు. ఈ నాలుగు సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేసాకే తదుపరి చిత్రాలు ఓకే చేస్తాడు.

విజయాలు వచ్చిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం ఎలాగంటూ హీరోలు టెన్షన్‌ పడిపోతారు. కథలు దొరక్క ఖాళీగా కూర్చుండిపోతారు. కానీ నాని కోసం కథలు క్యూ కట్టేస్తున్నాయి. అతనికున్న డిమాండ్‌తో ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు నానినే లాక్‌ చేసి పెట్టేసుకుంటున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగించినట్టయితే నాని చెయ్యనని రిజెక్ట్‌ చేసిన కథలే వేరే హీరోలకి దొరుకుతాయేమో.