జగ్గడు.. బోకేష్.! టీడీపీ, వైసీపీ.. ఉమ్మడి బరితెగింపు ఇదీ.!

ఒకరేమో ఐదేళ్ళు అధికారంలో వుండి, రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. ఇంకొకరేమో మూడేళ్ళుగా అధికార పీఠమెక్కి తందనాలాడుతూ రాష్ట్రాన్ని మరింత భ్రస్టుపట్టించేశారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నమాట. రాష్ట్రాన్ని ఉద్ధరించలేదు సరే.. ఒకరి స్థాయిని ఇంకొకరు దిగజార్చేసుకుంటూ.. ‘వీళ్ళా రాజకీయ నాయకులు.?’ అంటూ ఆంధ్రప్రదేశ్ పరువుని బజార్న పడేస్తుండడం మరింత దారుణమైన విషయం.

తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రెండూ కలిసి ఓ ఖచ్చితమైన అవగాహనతో, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్‌ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది పరిస్థితి చూస్తోంటే.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి వచ్చారు. దాదాపు లక్షన్నర కోట్ల పెట్టుబడుల్ని వైఎస్ జగన్ తీసుకొచ్చేశారన్నది వైసీపీ చేసుకుంటున్న ప్రచారం. గతంలో టీడీపీ హయాంలోనూ ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలు జరిగాయి. అప్పట్లో చంద్రబాబు దావోస్ పర్యటనల గురించి టీడీపీ చేసుకున్న ప్రచారమేంటో చూశాం.

అప్పుడు తాము చేసిందేంటో తెలియనంత అమాయకమైన స్థితిలో మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ వున్నారని అనుకోగలమా.? మరెందుకు, ‘సింగడు అద్దంకి పోయి వచ్చిన సామెతలా వుంది జగ్గడి దావోస్ పర్యటన..’ అంటూ సెటైర్ సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ వేసినట్టు.?

లోకేష్ ఇలా ట్విట్టర్‌లో సెటైర్ వేయగానే, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. బహుశా నేను ట్వీటేస్తా.. నువ్వు కూడా ట్వీటెయ్యి.. అని లోకేష్, విజయసాయిరెడ్డి ముందే అనుకున్నారేమో.!

‘మై డియర్ బోకేష్.. ఎమ్మారై మెషీన్‌లో పెడితే నీకున్న బ్రెయిన్ ఆవగింజంత.. స్కానింగ్‌ను ముందుకు కదుపుదాం అంటే మిగతాది సీమ పంది అంత..’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీటేశారు. సరిపోయింది సంబరం.!

ముఖ్యమంత్రిని జగ్గడు.. అని మాజీ మంత్రి విమర్శిస్తే.. మాజీ మంత్రిని బోకేష్.. అనేశారు రాజ్యసభ సభ్యుడు. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు ‘డాష్ గాళ్ళు..’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వేస్తున్న కామెంట్లని, రాజకీయ నాయకులెందుకు పట్టించుకోరు.? జనం నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

Share