నారా బాబుకి అరవపైత్యం అంటించేశారా?

ఎంతైనా చిత్తూరు వాడు కదా.. అరవోళ్ల ప్రభావం నారా రోహిత్‌పై కొంత మేర ఉండకపోదు. ఈ యువ కథానాయకుడి కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక ఇదేమైనా తమిళ సినిమాకు రీమేకా అని సందేహం కలగడం ఖాయం.

గుబురు గడ్డం.. గళ్ల లుంగీ.. చేతిలో కత్తి.. మొత్తంగా అచ్చమైన తమిళ హీరోలా తయారయ్యాడు నారా బాబు. కాస్త పరిశీలనగా చూస్తే తప్ప అక్కడున్నది నారా రోహితే అని గుర్తుపట్టలేం. తమిళంలో విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే సినిమాల్లో హీరోలు ఇలాగే ఉంటారు. సుబ్రమణ్యపురం (అనంతపురం).. పరుత్తి వీరన్ (మల్లిగాడు) సినిమాల్లో హీరోల్లాగా తయారయ్యాడు నారా రోహిత్.

మొన్న ‘కథలో రాజకుమారి’ టైటిల్ లోగో చూసి ఇదేదో సాఫ్ట్ లవ్ స్టోరీ అనుకున్నారు కానీ.. ఇది ఇంటెన్స్ యాక్షన్ సినిమాలాగా కనిపిస్తోంది ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే. రోహిత్ సినిమా అంతటా ఇలా కనిపిస్తాడా లేక.. ఈ లుక్ ఒక ఎపిసోడ్‌కు మాత్రమే పరిమితమా అన్నది తేలాల్సి ఉంది. ఈ చిత్రం సినీ నేపథ్యంలో సాగుతుందంటున్నారు. మరి హీరో నటుడిగా చేసిన పాత్ర తాలూకు లుక్ ఇది అయి ఉన్నా ఆశ్చర్యం లేదు. ఏదైతేనేం ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేకెత్తించేలా ఉన్న మాట వాస్తవం.

మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నారా రోహితే సమర్పకుడు కావడం విశేషం. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని నిర్మించిన ప్రశాంతి, విజయ్ కృష్ణలతో పాటు సౌందర్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.