మోడీ నోట బాహుబ‌లి మాట‌

‘బాహుబ‌లిః ది బిగినింగ్’ విడుద‌ల‌కు ముందు ఆ చిత్రాన్ని ఒక రీజ‌న‌ల్ మూవీగానే చూశారంద‌రూ. హిందీలో క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం వ‌ల్ల కొంత హైప్ వ‌చ్చింది కానీ.. మ‌రీ ఆ సినిమా కోసం అక్క‌డి జ‌నాలేమీ ఎగ‌బ‌డి పోలేదు. ఐతే రిలీజ్ త‌ర్వాత బాహుబ‌లి ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టించిందో.. ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని కూడా ఎలా ఉర్రూత‌లూగించిందో తెలిపిందే. ఎంద‌రో రాజ‌కీయ‌.. వ్యాపార ప్ర‌ముఖులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఇప్పుడు స్వ‌యంగా ప్ర‌ధాని నరేంద్ర మోడీ సైతం ఒక బ‌హిరంగ స‌భ‌లో బాహుబ‌లి ప్ర‌స్తావ‌న తేవ‌డం విశేషం.

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ అక్క‌డి రౌడీ రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించిన‌ ప్ర‌ధాని బాహుబ‌లి.. క‌ట్ట‌ప్ప‌ల గురించి మాట్లాడాడు. ‘‘ఒక సినిమా చివ‌ర్లో బాహుబ‌లి అనే పాత్ర‌ను క‌ట్ట‌ప్ప చంపేస్తాడు. మార్చి 11 త‌ర్వాత పోలీసులు అలాంటి వాళ్ల‌ను క‌ట్ట‌ప్ప త‌ర‌హాలో శిక్షిస్తారు’’ అని మోడీ అన్నారు. మోడీ బాహుబ‌లి గురించి మాట్లాడ‌టం బాగుంది కానీ.. ఆయ‌న‌కు బాహుబ‌లి అంటే హీరో అన్న విష‌యం అవ‌గాహ‌న లేన‌ట్లుగా ఉంది. ఆయ‌న మాట‌ల్ని బట్టి చూస్తే క్రిమిన‌ల్స్‌ను బాహుబ‌లితో పోలుస్తున్న‌ట్లుంది. ఏదేమైన‌ప్ప‌టికీ భార‌త ప్ర‌ధాని ఓ తెలుగు సినిమాలోని క్యారెక్ట‌ర్ల గురించి మాట్లాడారంటే అదంతా మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి గొప్ప‌ద‌న‌మే.