ప్రీమియర్లతోనే కోటి కొల్లగొట్టాడుగా

నేచురల్ స్టార్.. నేచురల్ స్టార్ అంటే ఇన్నాళ్లూ కొంచెం కామెడీగా తీసుకున్నారు కానీ.. నాని నిజంగానే స్టార్ అని ఇప్పుడు ఒప్పుకుని తీరాల్సిందే. అతడి కొత్త సినిమా ‘నేను లోకల్’ బంపర్ ఓపెనింగ్స్‌తో మొదలైంది. నాని ఖాతాలో మరో హిట్టు పడ్డట్లే. అతను డబుల్ హ్యాట్రిక్ కొట్టేసినట్లే. పాజిటివ్ టాక్‌తో మొదలైన ‘నేను లోకల్’ బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. వీకెండ్ మొత్తం విడుదలైన ప్రతిచోటా హౌస్ ఫుల్స్ గ్యారెంటీ అని తేలిపోయింది. థియేటర్ల దగ్గర ఒక పెద్ద హీరో హీరో సినిమా స్థాయిలో హంగామా కనిపిస్తోంది. బుకింగ్స్ యమ స్పీడుగా జరిగిపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ‘నేను లోకల్’ ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ రావచ్చు. నంబర్స్ ఊహించని స్థాయిలోనే ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక అమెరికాలో ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకునేలా ఉంది. కేవలం ప్రీమియర్ షోలతోనే కోటి రూపాయలు కొల్లగొట్టేసింది నాని సినిమా. ఈ సినిమాను అమెరికాలో 125 స్క్రీన్లలో రిలీజ్ చేయగా.. దాదాపు అన్ని చోట్లా ప్రీమియర్స్ పడ్డాయి. ఆ షోలతోనే 1.61 లక్షల డాలర్లు.. అంటే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది ‘నేను లోకల్’. కొందరు స్టార్ హీరోలకు సైతం ప్రీమియర్లతో ఇంత వసూళ్లు రావు. వీకెండ్ అయ్యేసరికే ఈ సినిమా హాఫ్ మిలియన్ క్లబ్బులో చేరేలా కనిపిస్తోంది. ఫుల్ రన్లో మిలియన్ క్లబ్బును కూడా అందుకోవచ్చేమో.