బీహార్‌ ఎన్నికల హామీగా కరోనా వ్యాక్సిన్‌.. ఇదేం వైపరీత్యం.?

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ని ‘ఎన్నికల హామీ’గా మార్చారు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. కానీ, ట్రంప్‌ ఆశించినట్లుగా సకాలంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. ఎంతైనా ట్రంప్‌గారి మిత్రుడు కదా.. మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ‘కరోనా వ్యాక్సిన్‌’తో ఎన్నికల స్టంట్‌ చేయాలనిపించినట్లుంది.!

బీహార్‌ ఎన్నికల వేళ, కరోనా వ్యాక్సిన్‌ని ప్రచారాస్త్రంగా మార్చారు. ‘మేం అధికారంలోకి వస్తే, బీహార్‌ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ని ఉచితంగా అందిస్తాం..’ అంటూ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంచలన ప్రకటన చేశారు. ఈ ఉచిత వ్యాక్సిన్‌ హామీ కేవలం బీహార్‌కి మాత్రమే వర్తిస్తుందట. అంటే, ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడితే.. బీహార్‌ ప్రజలకీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ దక్కదన్నమాట. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ఈ కరోనా వ్యాక్సిన్‌ ఎలక్షన్‌ స్టంట్‌.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి వుంది. కరోనా వైరస్‌ తీవ్రత ఆ స్థాయిలో వుందని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ని ఆయా దేశాల్లోకి రానీయకుండా.. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇక్కడ ప్రజల తప్పిదమేముంది.? ప్రభుత్వాల వైఫల్యం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. భారత ప్రభుత్వ వైఫల్యం కూడా తక్కువేమీ కాదు.

‘అంతర్జాతీయ విమాన రాకపోకల్ని తక్షణం నిలిపేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా వుంటుంది..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరిస్తే, కేంద్రం లైట్‌ తీసుకుంది. తీరిగ్గా అంతర్జాతీయ విమానాల్ని బంద్‌ చేసింది కేంద్రం. దేశమంతా కరోనా విస్తరించడానికి, కేంద్రం అమలు చేసిన ‘అన్‌లాక్‌’ మార్గదర్శకాలు కూడా కారణమే.

ఇన్ని వైఫల్యాలు తన దగ్గర పెట్టుకుని, కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ, కరోనా వ్యాక్సిన్‌ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చడం సిగ్గు చేటన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ ఒక్క ప్రకటనతో దేశవ్యాప్తంగా బీజేపీ ఇమేజ్‌ పాతాళానికి పడిపోతుందన్నది నిర్వివాదాంశం. ఎన్నికలున్నాయ్‌ కాబట్టి, బీహార్‌లో ఉచిత వ్యాక్సిన్‌ స్టంట్‌ చేస్తున్నారు.. మరి, మిగతా రాష్ట్రాల్లోని ప్రజల పరిస్థితేంటి.? అన్న ప్రశ్నకు బీజేపీ ఏం సమాధానం చెబుతుంది.?