జూ.ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై తేల్చేసిన బాల‌కృష్ణ‌

త‌ను వేరు, త‌న బ్ల‌డ్డూ -బ్రీడు వేరు అంటూ చెప్పుకునే నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఆఖ‌రికి త‌న అన్న కొడుకు కూడా వేర‌ని తేల్చేశాడు. త‌నేదో రాజ‌కీయాల్లో ఈదేస్తున్న‌ట్టుగా త‌న‌ను రాజ‌కీయంగా త‌న తండ్రితో పోల్చుకున్న బాల‌య్య అలాంటివి అంద‌రికీ సాధ్యం అయ్యేవి కావ‌ని తేల్చిపారేశాడు! ప్ర‌త్యేకించి తార‌క్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి బాల‌కృష్ణ స్పందించిన తీరు ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ అనేది ఇప్పుడు ఎందుకు ఆస‌క్తిదాయ‌క‌మో అంద‌రికీ తెలిసిందే. టీడీపీని ఏడాది కింద‌ట ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించారు. చంద్ర‌బాబుకు వ‌య‌సు మీద ప‌డుతూ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి యువ‌ర‌క్తం అవ‌స‌రం టీడీపీకి. లోకేష్ సంగ‌తి స‌రేస‌రి. లోకేష్ అంటే క‌మ్మ‌వాళ్లే జోకులేసుకుంటున్నారాయె! ఇలాంటి నేప‌థ్యంలో తార‌క్ మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయం అనే వాద‌న వాద‌న బ‌లంగా ఉంది.

అయితే వీలైతే తార‌క్ ను వాడుకోవ‌డానికే త‌ప్ప మ‌రో ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు నాయుడు ఇష్ట‌ప‌డ‌రనేది అంద‌రికీ క్లారిటీ ఉన్న అంశ‌మే. త‌న త‌ర్వాతే ఏదేమైనా లోకేషే త‌ప్ప మ‌రొక‌రికి ఛాన్స్ లేద‌న్న‌ట్టుగా ఉంది చంద్ర‌బాబునాయుడి తీరు. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ‌ది కూడా అదే మాటే అని తేలిపోయింది.

సినిమాల్లోనూ, రాజ‌కీయాల్లోనూ ఒకేసారి రాణించ‌డం త‌న తండ్రికి, త‌న‌కే సాధ్య‌మ‌ని బాల‌కృష్ణ చెప్పుకొచ్చాడు! ఎన్టీఆర్ అంటే స‌రే ప‌క్క‌న పెడ‌తాం, ఇంత‌కీ బాల‌య్య చేస్తున్న రాజ‌కీయం ఏముంది? ఏదో పార్టీ కంచుకోట‌లో నెగ్గారు, అక్క‌డ వైసీపీ లుక‌లుక‌ల‌తో రెండోసారీ నెగ్గారు. అప్పుడ‌ప్పుడు వెళ్లి షో చేసి వ‌స్తుంటారు. ఇక బాల‌య్య పీఏ అక్క‌డ అస‌లు రాజ‌కీయం చేశాడు. అది వేరే క‌థ‌, ఈ పాటికే త‌న‌ను తాను త‌న తండ్రి రాజ‌కీయంతో పోల్చేసుకున్నాడు బాల‌కృష్ణ‌. ఈ మాత్రం రాజ‌కీయం మ‌రొక‌రికి సాధ్యం కాద‌ని కూడా తేల్చాడు. ఎన్టీఆర్ శుభ్రంగా సినిమాలు చేసుకోవ‌చ్చ‌ని సూచించేశాడు. త‌ద్వారా తార‌క్ పై త‌న అభిప్రాయం ఏమిటో, అత‌డు రాజ‌కీయాల వైపు చూస్తే త‌న ప్రోత్సాహం ఏ పాటిదో కూడా బాల‌కృష్ణ తేల్చేసిన‌ట్టే!