పటేల్ సార్.. రెడీ అయిపోయాడు

తెలుగు ప్రేక్షకులకు షాకుల మీద షాకులిస్తున్నాడు ‘పటేల్ సార్’. మామూలుగా సినిమా మొదలై షూటింగ్ పూర్తి కావస్తున్న దశలో టీజర్ విడుదల చేస్తారు. కానీ ఈ చిత్రానికి మాత్రం ప్రారంభోత్సవం కూడా జరక్కుండానే టీజర్ లాంచ్ చేశారు. ట్రయల్ షూట్ తరహాలో టీజర్ కోసం ప్రత్యేకంగా చిత్రీకరణ జరిపి ఆసక్తికర టీజర్‌తో జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు.

ఆ తర్వాత సినిమాను మొదలుపెట్టి.. షూటింగ్ పూర్తయ్యాక ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. నిన్నో మొన్నో మొదలైనట్లుగా ఉన్న ఈ సినిమా అప్పుడే చిత్రీకరణ పూర్తి చేసుకుందట. సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయి అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారట.

ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ఈ నెలాఖర్లోనే ‘పటేల్ సార్’ను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ కొత్త దర్శకుడు ఇంత క్లారిటీతో ముందే టీజర్ రిలీజ్ చేయడం.. ఇంత వేగంగా సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడం విశేషమే. వాసు పరిమి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

జగపతి బాబు లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్ర కథ ఓ మధ్య వయసు వ్యక్తి.. ఓ చిన్నారిని శత్రువుల నుంచి కాపాడుకునే నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ‘అందరి బంధువయా’ ఫేమ్ పద్మ ప్రియ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనుంది. తెలుగులో ఇలాంటి మిడిలేజ్డ్ హీరో కథలు అరుదు. మరి ‘పటేల్ సార్’ మన ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతినందిస్తుందో చూడాలి.