టీజర్ కౌంట్లో పవన్ దే పవర్

ఒకప్పుడు సినిమాల హిట్లు గురించి లెక్కలు తీయాలంటే ఎన్ని రోజులు ఆడిందన్నది లెక్క. 200 రోజులా 100 రోజులా 50 రోజులా అన్నది లెక్క. అది కూడా ఎన్నెన్ని థియేటర్లలో అన్ని రోజులు ఆడిందో చూసేవారు. దీంతో పాటు కలెక్షన్ల లెక్క.  ఆ తరువాత సీను మారిపోయింది. వారాల లెక్కకు వచ్చేశారు. ఒక వారమా.. రెండు వారాలా అన్నది కీలకమైపోయింది. ఇప్పుడు స్టార్ డమ్, సినిమా దమ్మును కొలవడానికి రిలీజ్ కు ముందే పెరామీటర్లు వచ్చేశాయి. సినిమాకు ముందుగా రిలీజ్ చేసే టీజర్లను యూట్యూబ్లో ఎంతమంది చూశారన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఈ కౌంట్లో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరికీ అందనంత రేంజిలో రికార్డు సృష్టించాడు.

పవన్ రికార్డులు బ్రేక్ చేసే కార్యక్రమాన్ని  మొదలుపెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ టీజర్‌ రెండు గంటల సమయంలో వన్‌ మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది.  అంటే 10 లక్షల మంది దాన్ని చూశారన్న మాట. ఇప్పటిదాకా అత్యంత వేగంగా నెటిజన్లు వీక్షించిన టీజర్‌గా చిరంజీవి ‘ఖైదీ నంబర్‌150’ నమోదైంది. 3 గంటల 5 నిమిషాల్లో చిరు సినిమా టీజర్‌ వన్‌ మిలియన్‌ మార్కు చేరుకుంది. టీజర్‌ రికార్డులో మెగాస్టార్‌తో పాటు సౌతిండియా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ను దాటేశాడు పవర్‌స్టార్‌. రజినీ ‘కబాలీ’ టీజర్‌ 8 గంటల్లో 2 మిలియన్‌ వ్యూస్‌కు చేరుకుంది.

పవన్‌ కున్న ఫాలోయింగ్‌ ను, అతని సినిమాలపై ప్రేక్షకులకున్న ఆసక్తిని లక్షలు దాటుతున్న ఈ వ్యూస్‌ నే చూపిస్తున్నాయి. అజిత్‌, తమన్నా నటించిన తమిళ చిత్రం ‘వీరమ్‌’ రీమేక్‌ గా ‘కాటమరాయుడు’ రూపొందుతోంది. పవన్‌ సరసన శృతి హాసన్‌ నాయికగా నటిస్తోంది. తెలుగు సినిమా మరిచిపోయిన ఫ్యాక్షన్‌ కథా వస్తువు ఈ చిత్రంలో మళ్లి కనిపించబోతోంది.  మార్చి మూడో వారంలో ‘కాటమరాయుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.