తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పర్యటన షెడ్యూల్ ఖరారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు. ఏపీని ఇటివల నివర్ తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తుఫాను ప్రభావం చూపిన జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పవన్ సిద్ధమయ్యారు. నివర్ తుఫాను ప్రభావిత జిల్లాల జనసేన నాయకులతో ఆయన చర్చించిన మీదట పవన్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ను పార్టీ కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది.

పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించి వారి కష్టాలను, నష్టాలను తెలుసుకునేందుకు పవన్ షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 2వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. 2వ తేదీన ఉదయం 9:30లకు ఉయ్యూరు చేరుకుని అక్కడి నుంచి పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అక్కడ దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. అటునుంచి పులిగడ్డ వెంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుకుంటారు. అక్కడి నుంచి భట్టిప్రోలు, చావలి, పెరవలి, తెనాలి, నందివెలుగు, కొలకలూరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.

3వ తేదీన తిరుపతి చేరుకుంటారు. స్థానిక నేతలతో జిల్లాలో జరిగిన పంట నష్టంపై చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి చేరుకుని అక్కడి రైతాంగాన్ని పరామర్శించి పంట నష్టాలను అడిగి తెలుసుకుంటారు. తర్వాత నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో పర్యటించి నెల్లూరు జిల్లా చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రావూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు.