మత ప్రస్తావన లేని రాజకీయమంటే ఇదీ.!

‘మత ప్రస్తావన లేని రాజకీయం అంటే, మతాలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా వుండడం కాదు. అన్ని మతాలకు న్యాయం చేసి మత విద్వేషాలు లేకుండా చేయడం..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తిరుపతిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఇవే దాడులు, చర్చిలపైన జరిగినా మసీదులపైన జరిగినా.. మొత్తం దేశం కదిలొస్తుంది.. ప్రపంచమంతా స్పందిస్తుంది.. కానీ, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎవరూ స్పందించరా.? స్పందించకూడదా.?’ అని ప్రశ్నించిన జనసేన అధినేత, ‘డీజీపీ స్థాయి వ్యక్తికి స్వేచ్ఛ వుంటే ఎంతో చేయగలరు.. కానీ, వారు పొలిటికల్‌ బాసులు పెట్టే ఆంక్షల వలన స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారు.. అందుకే నేను వారిని ఏమీ అనలేను..’ అని చెప్పారు.

కాగా, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం తనవంతుగా 30 లక్షల విరాళాన్ని అందజేశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయమై స్పందిస్తూ, పక్షపాతంతో వ్యవహరించే అధికారుల్ని తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరతామని చెబుతూ, జరిగిన తప్పుల్ని సరిదిద్ది ఎన్నికలు నిర్వహించాలనీ డిమాండ్‌ చేశారు. ‘సమాజాన్ని విడగొట్టే మాటలు మాట్లాడను, రాజకీయాలు చేయను. సమాజాన్ని కలపాలనే ఆలోచన వున్నవాడిని. నేను స్వతహాగా హిందువుని అయినా, అన్ని మతాలనూ సమానంగా గౌరవించే వ్యక్తిని..’ అని పవన్‌ చెప్పుకొచ్చారు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన దిశలో ఆ చట్టాల్ని కేంద్రం అమలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు జనసేనాని. ‘లాక్‌డౌన్‌ సమయంలో మందు షాపులు తెరిచినప్పుడు, వైసీపీ నేతలు ర్యాలీలు చేసినప్పుడు లేని కరోనా భయం, ఇప్పుడు ఎన్నికలంటే ఎందుకు వస్తోందని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు.

‘దేవాలయాలపై దాడులకు సంబంధించి మొదటి ఘటన జరిగినప్పుడే తగిన చర్యలు తీసుకుని వుంటే, వరుస ఘటనలు జరిగేవి కావు. ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తోందనిగానీ, అధికార పార్టీ చేయిస్తోందనిగానీ నేను అనను. కానీ, ప్రభుత్వం ప్రదర్శించిన బాధ్యతారాహిత్యమే ఈ ఘటనలకు కారణం’ అని జనసేనాని కుండబద్దలుగొట్టేశారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు పవన్‌ కళ్యాణ్‌.